Karnataka : కర్ణాటక రాజధాని బెంగళూరులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఒక డుప్లెక్స్ ఇంట్లో మహిళ అస్థిపంజరం లభించింది. ఆమె మరణించి ఏడాది అవుతోందని పోలీసులు తెలిపారు. అయితే, ఇంతకాలం అవుతున్నా.. ఆమె మరణాన్ని ఎవరూ గుర్తించకపోవడం విచారకరం. ఈ ఘటనకు సంబంధించి బెంగళూరు పోలీసులు వెల్లడించిన వివరాలివి. మృతురాలి పేరు దాక్షాయిణి (52). బెంగళూరులోని హవనూర్ లేఔట్‌లోని దాక్షాయిణి సొంత డుప్లెక్స్ ఇంట్లో ఆమె అస్థిపంజరం లభించింది.
ఇక్కడ ఆమె ఒంటరిగా ఉండేది. పదేళ్లక్రితం ఆమె భర్త మరణించాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె కొడుకు కూడా క్యాన్సర్ కారణంగా మరణించాడు. దీంతో ఆమె తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లింది. అయితే, ఆమెకు కూతురు ఉంది. దాక్షాయిణికి ఆమె కూతురుతో, అల్లుడుతో విబేధాలున్నాయి. దీంతో వారిద్దరూ ఈమెను పట్టించుకోలేదు. చాలాకాలంగా మాట్లాడలేదు. ఈ క్రమంలో ఒంటరిగా ఉంటున్న దాక్షాయిణి.. అటు భర్త, కొడుకు మరణం.. ఇటు కూతురు పట్టించుకోకపోవడం కారణంగా తీవ్ర డిప్రెషన్‌కు గురైంది. అలాగే, తాను ఫోన్ నెంబర్ కూడా మార్చేసింది. దీంతో ఆమెకు ఇతరులతో సంబంధాలు లేకుండా పోయాయి. తన డుప్లెక్స్ ఇంట్లోనే మరణించింది. ఇది జరిగి ఏడాదవుతోంది. ఇప్పుడు ఆమె అస్థిపంజరం మాత్రమే లభ్యమైంది. చాలాకాలంగా తన తల్లితో సంబంధాలు లేవని, ఆమె తన ఫోన్ నెంబర్ కూడా మార్చేసిందని కూతురు చెబుతోంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆమె మరణానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు ఇంట్లోకి వచ్చి, అస్తిపంజరంతోపాటు ఆధారాలు సేకరించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగానే దాక్షాయిణి మరణానికి గల కారణాలు తెలుస్తాయి. ఈ రిపోర్ట్‌కు అనుగుణంగా విచారణ జరుపుతామని పోలీసులు ప్రకటించారు.