Riyadh : సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అల్-ఖర్జ్ గవర్నరేట్తోపాటు రియాద్‌లో రెండోసారి ప్రమాద హెచ్చరికలు జారీకావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే ఆ తర్వాత కాసేపటికే ప్రమాదం గడిచిపోయిందని, పరిస్థితి అదుపులోనే ఉందని సౌదీ సివిల్ డిఫెన్స్ ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శనివారం తెల్లవారుజామున రియాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు.
జాతీయ హెచ్చరిక ప్లాట్‌ఫామ్ ద్వారా నివాసితుల మొబైల్స్‌కు ఎయిర్ డిఫెన్స్ అలర్ట్‌లు అందాయి. అయితే ఆ తర్వాత కాసేపటికే ప్రమాదం ముగిసినట్లు సివిల్ డిఫెన్స్ తమ ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. ప్రజలు గుంపులుగా చేరవద్దని, ఘటనకు సంబంధించిన ఫొటోలు తీయవద్దని సూచించింది. యెమెన్‌కు చెందిన హౌతీ రెబల్స్ దాడులు తీవ్రం చేసిన తర్వాత రియాద్‌లో ఇలాంటి హెచ్చరిక జారీకావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
శుక్రవారం కూడా జెడ్డా, తాయిఫ్, అల్-ఉలా వంటి నగరాల్లో అలర్ట్‌లు జారీచేసి తర్వాత రద్దుచేశారు. జూలై నుంచి ఇరాన్ మద్దతున్న హౌతీలు సౌదీ అరేబియాపై డ్రోన్, క్షిపణి దాడులను పెంచారు. గురువారం తాయిఫ్‌లో ఓ హౌతీ డ్రోన్‌ను కూల్చివేయగా, దాని శకలాలు పడి ఒక యెమెన్ పౌరుడు మరణించాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. తమపై సౌదీ జరుపుతున్న వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేస్తున్నట్లు హౌతీలు ప్రకటించారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు కిటికీలు, బాల్కనీలకు దూరంగా ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు.