Low Calorie Sweeteners | చక్కెరకు ప్రత్యామ్నాయంగా తక్కువ కేలరీల స్వీటెనర్లను ఉపయోగించడం ఇటీవలి కాలంలో పెరిగింది. వాటిలో జైలిటాల్ కూడా ఒకటి. షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్‌లు, క్యాండీలు, ప్రాసెస్డ్ ఆహారాలు, టూత్‌పేస్ట్ వంటి అనేక ఉత్పత్తుల్లో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే జైలిటాల్ వల్ల గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంశంపై తాజాగా వెలువడిన పరిశోధన ఆసక్తికర విషయాలను వెల్లడించింది. యురోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కాంగ్రెస్ 2026లో సమర్పించిన ఈ అధ్యయనంలో రక్తంలో జైలిటాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారికి గుండెపోటు, స్ట్రోక్, గుండె సంబంధిత మరణాలు వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గుర్తించారు.
ఈ పరిశోధనలో ఉత్తర అమెరికా, యూరప్‌కు చెందిన రెండు పెద్ద అధ్యయనాల నుంచి మొత్తం 17,710 మంది వివరాలను పరిశీలించారు. ఒక అధ్యయనంలో పాల్గొన్నవారిని ఆరు సంవత్సరాల పాటు, మరో అధ్యయనంలో కొందరిని 30 సంవత్సరాల వరకు పరిశీలించారు. వయసు, ధూమపానం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి ఇతర గుండె సంబంధిత ప్రమాద కారకాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఆరు సంవత్సరాల పరిశీలనలో రక్తంలో జైలిటాల్ స్థాయిలు అత్యధికంగా ఉన్నవారికి, తక్కువ స్థాయిలు ఉన్నవారితో పోలిస్తే తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం 57 శాతం ఎక్కువగా కనిపించింది. దీర్ఘకాలిక అధ్యయనంలో ఈ సంబంధం 18 శాతంగా నమోదైంది. జైలిటాల్ స్థాయిలు పెరిగే కొద్దీ గుండె సంబంధిత ప్రమాదం కూడా పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
జైలిటాల్ గుండెపై ప్రభావం చూపడానికి రక్తంలోని ప్లేట్లెట్ల కార్యకలాపాలు ఒక కారణం అవుతాయని పరిశోధకులు భావిస్తున్నారు. రక్తస్రావాన్ని ఆపేందుకు ప్లేట్లెట్లు రక్తం గడ్డకట్టే ప్రక్రియలో సహాయపడతాయి. అయితే అవి అధికంగా చురుకుగా మారితే అవసరం లేని రక్తం గడ్డలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గతంలో నిర్వహించిన ప్రయోగాల్లో జైలిటాల్ తీసుకున్న తర్వాత ప్లేట్లెట్ల గడ్డకట్టే సామర్థ్యంలో మార్పులు కనిపించాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రక్రియను ఇది ప్రోత్సహిస్తుందని కొన్ని ప్రయోగశాల పరిశోధనలు కూడా సూచించాయి. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనిలో రక్తం గడ్డ ఏర్పడి రక్తప్రసరణకు అడ్డంకి కలిగితే గుండెపోటు వస్తుంది. మెదడుకు రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడితే ఇస్కీమిక్ స్ట్రోక్ సంభవించే అవకాశం ఉంటుంది.
అయితే ఈ పరిశోధన ఆధారంగా జైలిటాల్ తీసుకోవడం వల్ల నేరుగా గుండెపోటు లేదా స్ట్రోక్ వస్తుందని చెప్పలేమని పరిశోధకులు స్పష్టం చేశారు. ఇది పరిశీలనా అధ్యయనం కావడంతో జైలిటాల్ స్థాయిలు, గుండె సంబంధిత సమస్యల మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రమే గుర్తించింది. కారణం-ఫలిత సంబంధాన్ని నిర్ధారించలేదు. అందువల్ల జైలిటాల్ ఉన్న ప్రతి ఉత్పత్తిని ప్రమాదకరంగా భావించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చూయింగ్ గమ్, టూత్‌పేస్ట్ వంటి ఉత్పత్తుల ద్వారా సాధారణంగా జరిగే వినియోగం గుండెపోటు లేదా స్ట్రోక్‌కు కారణమవుతుందని ఈ అధ్యయనం నిరూపించలేదు. అయితే చక్కెరకు ప్రత్యామ్నాయంగా జైలిటాల్ను పెద్ద మొత్తంలో, క్రమం తప్పకుండా తీసుకునే విషయంలో మరింత పరిశోధన అవసరమని తాజా ఫలితాలు సూచిస్తున్నాయి.