బూర్గంపహాడ్, ఆగస్టు 08 : పోలీస్ నిబంధనలను వాహనదారులు బేఖాతర్ చేస్తున్నారు. పారిశ్రామిక కారిడార్‌గా ఉన్న బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురంలో లారీ యార్డు వద్ద వాహనాలు రోడ్డుకు ఇరువైపులా నిలుపుతూ నిబంధనలను అతిక్రమించడంపై శుక్రవారం బూర్గంపహాడ్ పోలీసులు యార్డు సమీపంలో రోడ్డుకు ఇరువైపులా నో పార్కింగ్ బోర్డులను ఏర్పాటు చేశారు. నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేసి 24 గంటలు గడవక ముందే యార్డుకు వచ్చే లారీలను నో పార్కింగ్ బోర్డులు ఉన్నా అక్కడే నిలిపివేసి పోలీసు అధికారుల హెచ్చరికలను బేఖాతర్ చేశారు. ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే చర్యల్లో భాగంగా ఈ ప్రాంతంలో 10 వరకు నో పార్కింగ్ బోర్డులను పోలీసులు ఏర్పాటు చేసినప్పటికీ, యార్డుకు వచ్చి పోయే లారీలు రోడ్డుకు పక్కనే నో పార్కింగ్ బోర్డుల వద్దే నిలపడం ఏంటని వాహనదారులు మండిపడుతున్నారు. లారీలను నిబంధనలకు విరుద్ధంగా అడ్డదిడ్డంగా నిలిపే వారిపై, లారీ యార్డు నిర్వాహకులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.