Dwarka Expressway : హరియాణాలోని గుర్గావ్ పట్టణానికి సమీపంలో ద్వారకా ఎక్స్ప్రెస్ వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక కారు ఢీకొనడంతో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి 2.30 గంటల తర్వాత గుర్గావ్ ఫ్లై ఓవర్ కింద, న్యూపాలం విహర్ పరిధిలోని శ్రీరామ్ చౌక్ వద్ద జరిగింది.
ఘటన జరిగిన సమయంలో నలుగురు కూలీలు ద్వారకా ఎక్స్ప్రెస్ వేపై ఉన్న ఫ్లై ఓవర్ కింద ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. గ్రిల్స్ ఏర్పాటు చేసే పనిలో ఉన్న కార్మికులపైకి అతివేగంగా వచ్చిన ఒక కారు దూసుకెళ్లింది. కారు వేగంగా వస్తుండటం చూసిన కార్మికులు ఆ గ్రిల్స్ సమీపం నుంచి పక్కకు దూకేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ కారు వారిని ఢీకొంది. ఈ ఘటనలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. నలుగురిలో ఇద్దరు కార్మికులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా కారు నడిపింది 20 ఏళ్ల వేదాన్ ఖన్నగా గుర్తించారు.
ఈ ప్రమాదంలో అతడికి కూడా గాయాలయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుల్ని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరి మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు కారు వేగం ఎంతగా ఉందంటే.. కారు నుజ్జునుజ్జయింది. కారు డ్రైవర్ వేదాన్ కూడా స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.