Asim Mandal : మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. సీపీఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ సభ్యుడైన అసిమ్ మండల్ అలియాస్ ఆకాశ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆయన పశ్చిమబెంగాల్లో లొంగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఆయనపై జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలు భారీ మొత్తంలో రివార్డులు ప్రకటించాయి. జార్ఖండ్ ప్రభుత్వం మండల్ తలపై రూ.1 కోటి రివార్డు ప్రకటించగా.. ఒడిశా ప్రభుత్వం రూ.1.20 కోట్లు రివార్డు ప్రకటించింది. మొత్తం మీద ఇతనిపై రూ.2.20 కోట్ల రివార్డు ఉంది.
పశ్చిమబెంగాల్లోని పశ్చిమ మేదినీపూర్ జిల్లా చంద్రకోన పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉత్తర ఫుల్చుక్ గ్రామ నివాసి అయిన అసిమ్ మండల్.. మావోయిస్టు పార్టీలో ఆకాశ్, తిమిర్, మనోజ్, దీపక్, రాకేశ్ వంటి పలు పేర్లతో కార్యకలాపాలు సాగించాడు. ముఖ్యంగా జార్ఖండ్‌లోని కోల్హాన్, సారండా ప్రాంతాల్లో అనేక సంవత్సరాలుగా మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. ఇతని లొంగుబాటును జార్ఖండ్ పోలీసులు కూడా ధృవీకరించారు. జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఇతనిపై సుమారు 55 తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
వీటిలో చాలావరకు భద్రతా బలగాలపై దాడులు, ఎన్కౌంటర్లకు సంబంధించినవే. 2026 మార్చి 1న చైబాసాలోని మరంగ్పొంగ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో కోబ్రా 209వ బెటాలియన్‌కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్‌తో సహా ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడటంలో ఇతని పాత్ర ఉంది. అలాగే 2025 ఏప్రిల్ 12న రాధాపోర వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఒక జార్ఖండ్ జాగ్వార్ జవాన్ మరణించాడు. ఇవేకాక 2023 జనవరి 11న టోంటో పోలీస్ స్టేషన్ పరిధిలోని తుంబహాక అటవీ ప్రాంతంలో జరిగిన ఐఈడీ పేలుడులో 9 మంది కోబ్రా బెటాలియన్ సిబ్బంది గాయపడ్డారు.
2020 మే 31న జోన్వాలో, 2018 జూలై 11 న ఝాటీ పహారీలో జరిగిన దాడుల్లో ఒక్కొక్కరు చొప్పున భద్రతా సిబ్బంది మరణించారు. ఈ ఘటనలన్నింటిలోనూ అసిమ్ మండల్ కీలక సూత్రధారిగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం అసిమ్ మండల్‌ను అదుపులోకి తీసుకున్న భద్రతా ఏజెన్సీలు.. మావోయిస్టుల నెట్వర్క్, ఆయుధ నిల్వలు, రహస్య స్థావరాలపై కీలక సమాచారం రాబట్టేందుకు విచారిస్తున్నాయి. ముఖ్యంగా సారండా అడవుల్లో దాచిపెట్టిన ఆయుధాలు, పేలుడు పదార్థాల గురించి ఇతని ద్వారా కీలక సమాచారం లభించవచ్చని అధికారులు భావిస్తున్నారు.