కారేపల్లి, సెప్టెంబర్ 23 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రెండో రోజు గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠాన దేవతగా అమ్మవారిని భక్తులు కొలిచారు. కొబ్బరి అన్నాన్ని నివేదనగా సమర్పించారు. సకల మంత్రాలకు, వేదాలకు మూలమైన దేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి. ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది. పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత అయిన గాయత్రీదేవిని పూజిస్తే సకల ఉపద్రవాలూ తొలగుతాయనీ, బుద్ధి తేజోవంతం అవుతుందని భక్తుల నమ్మకం.
మహత్తర శక్తి గల జగన్మాత ఐదు ముఖాలతో వరదాభయ హస్తాలు ధరించి కమలాసనాసీనురాలిగా దర్శనమిస్తున్నారు. సింగరేణి (కారేపల్లి), జూలూరుపాడు, ఏన్కూరు, వైరా, కొణిజర్ల మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల్లో కొలువైన అమ్మవారిని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శించుకున్నారు. దీంతో ఉత్సవ మండపాల వద్ద కోలాహలం నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు, నిర్వాహక కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.