హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ)/గీసుగొండ : అతను గ్రామ స్వరాజ్య స్వాప్నికుడు. పురిటిగడ్డను దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన నేత. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న గొప్ప నాయకుడు. సర్పంచ్‌గా, ఉప సర్పంచ్‌గా, సొసైటీ చైర్మన్‌గా సేవలందించిన వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గంగదేవిపల్లికి చెందిన కూసం రాజమౌళి (76) ఇక లేరనే విషయం ప్రజలను శోకసంద్రంలో ముంచింది. ఆదివారం మధ్యా హ్నం ఛాతి నొప్పితో అస్వస్థతకు గురైన రాజమౌళి వరంగల్‌లోని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశారు. సర్పంచ్‌గా ఆయన విశేష సేవలందించారు. రాజమౌళి మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. 1994లో గంగదేవిపల్లి.. మచ్చాపురం నుంచి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడింది. 1995లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజల సహకారంతో తన భార్య కూసం లలిత సర్పంచ్‌తోపాటు 10 మంది మహిళా వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2001లో జరిగిన ఎన్నికల్లో కూసం లలితనే గ్రామస్థులు మరోసారి ఏకగ్రీవంగా చేసుకున్నారు.
మూడోసారి కూసం రాజమౌళి 2006 నుంచి 2011 వరకు సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2013లో సర్పంచ్ స్థానం ఎస్టీలకు రిజర్వు కావడంతో బలహీనవర్గాలకు చెందిన రాజమౌళి ఉప సర్పంచ్‌గా కొనసాగారు. రెండు దశాబ్దాలు గ్రామాభివృద్ధికి ఆయన సేవలందించారు. గంగదేవిపల్లి పంచాయతీగా ఏర్పడిన మొదటి ఏడాదిలోనే గ్రామ అభివృద్ధికి పునాది వేశారు. తర్వాత కాలంలో జిల్లాలో అతి పెద్ద రైతు సహకారం సంఘం ఊకల్ సొసైటీకి రాజమౌళి చైర్మన్‌గా పనిచేశారు. ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించడంతోపాటు వాటిని వినియోగించేలా చూశారు. 1999లో అప్పటి కలెక్టర్ గంగదేవిపల్లిని సందర్శించి నగదు అవార్డు అందజేశారు. 2002లో వందశాతం అక్షరాస్యత సాధించిన గ్రామంగా అవార్డు అందుకున్నది. 2005లో అప్పటి సీఎం వైఎస్సార్ చేతుల మీదుగా రాష్ట్ర ఆదర్శ గ్రామ అవార్డు అందుకున్నది. 2007లో రాష్ట్రపతి అబ్దుల్‌కలాం చేతుల మీదుగా నిర్మల్ గ్రామ పురస్కారం సొంతం చేసుకున్నది. ఉమ్మడి వరంగల్‌లో నాలుగుసార్లు ఉత్తమ పంచాయతీ అ వార్డు అందుకున్నది. రెండుసార్లు రాష్ట్ర స్థాయి లో, నాలుగు సార్లు జాతీయ స్థాయిలో అవార్డులు గ్రామం సొంతం చేసుకున్నది. వందకుపైగా గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు, సినీతారలు గ్రామాన్ని సందర్శించా రు. 2007లో జాతీయ ఆదర్శ గ్రామంగా గంగదేవిపల్లి ఎంపికైంది. అలాంటి నేత హఠాన్మరణంతో గ్రామం పెద్ద దిక్కును కోల్పోయింది.
దేశంలోనే ఆదర్శ పంచాయతీగా గుర్తింపు పొందిన గంగదేవిపల్లిని స్వరాష్ట్రంలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అప్పటి సీఎం కేసీఆర్ 2015 ఆగస్టు 17న ఆ గ్రామాన్ని సందర్శించి గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రా రంభించారు. గ్రామస్థులతో కలిసి ఊరంతా పరిశీలించారు. అభివృద్ధి పనులపై కేసీఆర్ రాష్ట్రస్థాయి అధికారులతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. గ్రామాభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో గ్రామంలో జిల్లా ట్రైనింగ్ సెంటర్‌తోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమా లు చేపట్టారు. 2019లో రాజమౌళిని అప్పటి సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధి కోసం డీటీఏంగా (జిల్లా శిక్షణ మేనేజర్‌గా) నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులకు, విదేశీ పర్యాటకులు, అధికారులకు గ్రామాల అభివృద్ధికి శిక్షణ ఇప్పించారు. తుదిశ్వాస విడిచే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు. ప్రభుత్వం నుంచి నెలకు రూ.30 వేల పారితోషికాన్ని అందుకున్నారు.

గ్రామ స్వరాజ్యానికి అసలైన అర్థం తెలిపి, దేశానికే ఆదర్శ గ్రామంగా, తెలంగాణ పల్లెగా, గంగదేవిపల్లిని తీర్చిదిద్దడంలో కూసం రాజమౌళిది కీలక పాత్ర అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు. గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసి, అన్ని రంగాలను అభివృద్ధి పరిచి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ, పల్లెల అభ్యున్నతికి అసలైన నిర్వచనం చెప్పిన వ్యక్తి రాజమౌళి అని కీర్తించారు. రాజమౌళి మరణం దేశ పంచాయతీ రాజ్ వ్యవస్థకు తీరనిలోటు అని పేర్కొన్నారు. దేశంలోని గ్రామాలు ఒక ఆదర్శవంతమైన సర్పంచ్‌ను కోల్పోయాయని ఆదివారం ఒక ప్రకటనలో విచారం వ్యక్తంచేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన పల్లె ప్రగతి, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో రాజమౌళి అనుభవాలను నాటి ప్రభుత్వం వినియోగించుకున్నదని తెలిపారు. ఆయన కృషిని గుర్తించి బీఆర్ఎస్ హయాంలో రాజమౌళిని సమున్నతంగా గౌరవించుకున్నట్టు పేర్కొన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. రాజమౌళి మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.