Meher Ramesh | దర్శకుడు మెహర్ రమేష్ ఇటీవల తన పెద్ద సోదరి మెహర్ జ్యోతి సుంకరను కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ విషాదం నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నారు. అక్క మరణంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆయన, తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ అభిమానులను కదిలిస్తోంది. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో మెహర్ రమేష్ షేర్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఆయన, తన అక్క మెహర్ జ్యోతి సుంకరతో పాటు వారి మామయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా కనిపించారు. చిన్ననాటి అమూల్యమైన ఆ క్షణాన్ని అభిమానులతో పంచుకున్న ఆయన, అక్కతో గడిపిన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
అంతేకాదు, తన అక్కకు సంబంధించిన మరో తాజా ఫోటోను కూడా పంచుకున్నారు. అందులో నాగబాబు ఆమెతో కలిసి కనిపించారు. అలాగే కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా షేర్ చేస్తూ, తమ కష్ట సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన పోస్ట్‌లో మెహర్ రమేష్ మాట్లాడుతూ, జీవితంలో అత్యంత క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి ధైర్యం చెప్పిన బంధువులు, స్నేహితులు, సినీ ప్రముఖులు, అభిమానుల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. అక్క జ్ఞాపకాలు ఎప్పటికీ తమ హృదయాల్లో నిలిచిపోతాయని, ఆమె ప్రేమ, ఆప్యాయత జీవితాంతం వెంట ఉంటాయని భావోద్వేగంగా రాసుకొచ్చారు.
కాగా, మెహర్ జ్యోతి సుంకర గత 14 రోజులుగా వైరల్ న్యుమోనియాతో పోరాడుతూ చికిత్స పొందారు. వైద్యుల ప్రయత్నాలు ఫలించక ఆమె కన్నుమూయడం కుటుంబ సభ్యులతో పాటు మెగా కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి మెహర్ రమేష్‌ను పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మెహర్ రమేష్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అభిమానులు, సినీ ప్రముఖులు కామెంట్ల రూపంలో ఆయనకు ధైర్యం చెబుతూ, మెహర్ జ్యోతి సుంకర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. అక్కపై మెహర్ రమేష్‌కు ఉన్న ప్రేమ, అనుబంధాన్ని ప్రతిబింబించిన ఈ పోస్ట్ ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.