హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు డిమాండ్ అమాంతం పెరుగుతున్న క్రమంలో టీజీ జెన్కో చెందిన థర్మల్ ప్లాంట్లల్లో వరుసగా షట్డౌన్ అవుతున్నాయి. అత్యంత కీలకమైన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)లో మూడు యూనిట్లు బంద్ అయ్యాయి. సోమవారం యూనిట్-1 నిలిచిపోగా, మంగళవారం యూనిట్-4 ఆకస్మికంగా ట్రిప్ అయ్యింది. మాస్టర్ ఫ్యూయల్ ట్రిప్ కావడంతో యూనిట్-4లో అకస్మాత్తుగా విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేశారు. ఇదే ప్లాంట్లోని యూనిట్-1 ఫ్లేమ్ ఫేల్యూట్ (మంట ఆగిపోవడం)లో ఉత్పత్తిని నిలిపివేశారు. యూనిట్-3 బాయిలర్ ట్యూబ్ లీకేజీ సమస్యతో ఈనెల 20 నుంచి నడువటంలేదు. ఐదు యూనిట్లు గల ఈ ప్లాంట్లో నాలుగు యూనిట్లల్లో కమర్షియల్ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. ఈ నాలుగు యూనిట్లకు ఈ ప్లాంట్లో మూడు యూనిట్లు బంద్ అయ్యాయి. దీంతో 2,400 మెగావాట్లు విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది.