యాదగిరిగుట్ట, మార్చి 8 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి క్షేత్రంలో భక్తుల సందడి నెలకొన్నది. ఆదివారం ఎటుచూసినా భక్తులే కనిపించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. తిరుమాడవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, శివాలయం, శ్రీవారి మెట్ల మార్గం సందడిగా మారింది. సుమారు 38 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామివారి దర్శదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. తెల్లవారు జామునే ఆలయ తలుపులు తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి, ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, శ్రీఆంజనేయస్వామివారికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు.
వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను ద్యివ మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవసేవ జరిపారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణతంతు చేపట్టారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్యతిరు కల్యాణ తంతు నిర్వహించారు. కల్యాణమూర్తులను ముస్తాబు చేసి భక్తులకు అభిముఖంగా అధిష్టించి నిత్యకల్యాణ తంతు నిర్వహించారు. సాయంత్రం శ్రీస్వామివారిని గరుడవాహనంపై, అమ్మవారిని తిరుచ్చి సేవపై వేంచేపు చేసి జోడు సేవను తిరు వీధుల్లో ఊరేగించారు. ప్రధానాలయ ముఖ మండపంలో దర్బార్ సేవలో భాగంగా సువర్ణమూర్తులకు ప్రత్యేక పూజలు జరిపి, నక్షత్ర హారతి ఇచ్చారు. రాత్రివేళలో శ్రీస్వామివారి తిరువారాధన చేపట్టి, స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, శ్రీఆంజనేయ స్వామివారికి సహస్ర నామార్చన జరిపారు. స్వామివారి ఖజానాకు రూ. 45,46,811 ఆదాయం సమకూరిందని ఆలయ ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భవానీశంకర్ తెలిపారు.
స్వామివారి ప్రధానాలయంతోపాటు అనుబంధ పాతగుట్ట(పూర్వగిరి) ఆలయంలో స్వాతినక్షత్రపు పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా వైభవంగా అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో 108 కలశాలను ఏర్పాటు చేసి గంగాది, సప్తనదీ జలాలు, మామిడి, తమలపాకులు, దర్భలు, పూలమాలలు, కొబ్బరికాయలతో అలంకరించారు. పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. ఆయా దేవతల మూలమంత్ర పఠనాలతో హోమ పూజలు నిర్వహించారు. ప్రధానాలయంలో కొలువుదీరిన స్వయంభూ పంచనారసింహస్వామి, సువర్ణప్రతిష్ఠా అలంకారమూర్తులను వేదమంత్రాలతో అష్టోత్తర శతఘటాభిషేక పూజలు నిర్వహించి సువర్ణపుష్పాలతో అర్చించారు.
సాయంత్రం స్వాతి జన్మనక్షత్రం సందర్భంగా స్వామివారిని దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రంలో భాగంగా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే సామూహిక గిరిప్రదక్షిణలో భక్తులు పాల్గొన్నారు. తెల్లవారు జామూన స్వామివారి వైకుంఠ ద్వారం వద్ద ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, అనువంశికధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భవానీశంకర్, డీఈవో దోర్బల భాస్కర్ ప్రారంభించారు. కొండచుట్టూ కాలినడక పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ధార్మిక సంగీత సాహిత్య కార్యక్రమం, 12ఏళ్ల వైష్ణోదేవి కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నది.