పెన్పహాడ్, ఆగస్టు 11 : అనుమానం పెనుభూతమైంది. ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో భర్త భార్యను సీసీ రోడ్డుపై పడేసి మెడ, ఛాతిపై కాలితో బలంగా తొక్కడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ పోలీస్స్టేషన్ పరిధిలోని నూర్జవాన్ పేటలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నూర్జవాన్ గ్రామనికి చెందిన బానోతు రవి, బానోతు సునీత (36) భార్యాభర్తల మధ్య గతకొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. అనుమానంతో భార్య సునీతను పలుమార్లు వేదించడమే కాకుండా చంపేస్తా అని బెదిరింపులకు గురిచేసేవాడు. అదే క్రమంలో సోమవారం రాత్రి 7 గంటల సమయంలో తనను చంపుతాడేమోనని భయంగా ఉందంటూ సునీత సూర్యాపేటలో చదువుకుంటున్న కుమారుడు శ్రీషాంత్ కు ఫోన్ చేసి చేపింది.
ఆ తర్వాత రాత్రి 9 గంటల సమయంలో రవి తన భార్యతో గొడవ పడి సీసీ రోడ్డుపై క్రింద పడేసి మెడ, ఛాతిపై కాలితో బలంగా తొక్కగా సునీత అక్కడికక్కడే సృహ తప్పి పడిపోయింది. గమనించిన స్థానికులు అంబులెన్స్ లో ఆమెను సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లి మరణ వార్త విన్న కుమారుడు శ్రీశాంత్ ఆస్పత్రికి చేరుకుని కన్నీరు మున్నీరయడ్యూడు. తన తండ్రి బానోతు రవిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలాన్ని సీఐ జి.రాజశేఖర్, ఎస్ఐ బాలు నాయక్ పరిశీలించారు.