Theatres | సినిమాకు వెళ్లిన ప్రతిసారీ టికెట్ కొనాల్సిన పన్లేదు. నెలాఖరులో పర్సు తడుముకోవాల్సిన అవసరమూ లేదు. నెలనెలా కేబుల్ బిల్లు చెల్లించినట్టు, బ్రాడ్‌బ్యాండ్ పైసలు ముట్టజెప్పినట్టు, దేవుడి హుండీలో డబ్బు వేసినట్టు.. ఓ ఏడొందలు ఖర్చుపెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే చాలు. ఆ నెలలో ఆరేడు సినిమాలు చూడొచ్చు. షరా: పాప్‌కార్న్, కూల్‌డ్రింక్ ఖర్చులు అదనం.
గతంలో ప్రేక్షకులను థియేటర్లు అయస్కాంతంలా ఆకర్షించేవి. కొత్త బొమ్మ పడిందా జాతరే. జనాన్ని చూడ్డానికి, వాల్‌పోస్టర్లు తిలకించడానికి థియేటర్ వరకూ వెళ్లేవారు. ఎవరికైనా అడ్రస్ చెప్పాల్సి వస్తే.. పిన్‌కోడ్ పక్కనపడేసి, సినిమా కోడ్ వాడేవారు. ‘లక్ష్మీ టాకీస్ పక్కసందు’, ‘రామ్-లక్ష్మణ్ వెనుక వీధి’ అంటూ అరచేతిలో గూగుల్ మ్యాప్ చూపించేవారు. థియేటర్లో టికెట్లు చించేవాడికి కూడా ఆ ఊరి సర్పంచ్ అంత గౌరవం. టీవీల వల్ల కొంత, ఓటీటీల వల్ల మరికొంత..కారణం ఏమైతేనేం హాలు నిండటం గగనం అయిపోయింది. చాలా థియేటర్లు కల్యాణ మండపాలుగా మారిపోయాయి. టికెట్ల ధరలు మాత్రం తక్కువ పెరిగాయా? ఒకటని ఏమిటి.. వెండితెర ఎండిపోడానికి ఎన్నో కారణాలు. ఆ లోపాల్ని ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నది సినిమా పరిశ్రమ. ఆ వైపుగా మల్టీప్లెక్స్‌లు తొలి అడుగు వేస్తున్నాయి. ఎలాగోలా సీట్లు నింపే ప్రయత్నం చేస్తున్నాయి.
పాస్‌పోర్ట్ ఉందా?
ఏ అమెరికాకో, ఇంగ్లండ్‌కో వెళ్లాలంటే పాస్‌పోర్ట్ కావాలి. ఆ ఏర్పాట్లలో ఉన్నవారు తీసుకునే ఉంటారు. ఫిల్మీ దునియా ముచ్చట్లలో ఫారిన్ టూర్ కబుర్లు ఎందుకు? అంటారా. సినీ ప్రపంచంలో ఇదో సరికొత్త పాస్‌పోర్టు. విమానం ఎక్కడానికి కాదు.. థియేటర్లో కాలు పెట్టేందుకు. వారాంతాల్లో థియేటర్ అటెండెన్స్ పెంచడానికి మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్-ఐనాక్స్ చేస్తున్న సరికొత్త ప్రయోగం ఇది. నెలకు రూ.699 చెల్లిస్తే చాలు. ముప్పై రోజుల్లో ఏడు సినిమాలు చూడొచ్చు. అంటే, సినిమాకు వంద రూపాయలు. భలే మంచి చౌక బేరమే. మల్టీప్లెక్స్ అనుభూతి కోసమైనా నెలకోసారి థియేటర్లకు వెళ్లే వెండితెర అభిమానులు చాలామందే ఉన్నారు. వారిని, వారానికోసారి పిలిపించుకోడానికే ఈ ప్రయత్నం. ఒక్కసారి ఆ భారీ తెరకు, ప్రేక్షకుల సందడికి, బ్రేక్‌లో పాప్కార్న్కూ, కూల్ డ్రింక్స్‌కూ అలవాటు చేస్తే కనుక స్వర్ణయుగం ఖాయం. ‘హౌస్‌ఫుల్ బోర్డులు’ మళ్లీ ప్రత్యక్షం. ఈ సాహసోపేత నిర్ణయం వెనుక ఓ భయమూ ఉంది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే.. సినిమా కలెక్షన్లు పదిహేనుశాతం పడిపోయాయి. ఇంతే నిర్లిప్తత కొనసాగితే.. పరిశ్రమ, ట్వంటీఫోర్ క్రాఫ్ట్స్ శ్రమ.. బూడిదపాలే.
పీవీఆర్-ఐనాక్స్ కో-సీఈవో గౌతమ్దత్తా మాత్రం ఆ వాదనను కొట్టేస్తున్నారు. ‘బుల్లితెర, స్మార్ట్తెరకు అలవాటైన వయోధికులు, కాలేజీ విద్యార్థులు, గృహిణులను థియేటర్ వైపు తిప్పుకోడానికే ఈ ప్రయత్నమంతా’ అని చెబుతారాయన. తొలిదశలో ఇరవైవేల సబ్స్క్రిప్షన్లు విక్రయించాలని ఆలోచన. ముంబై, బెంగళూరు తదితర నగరాలలో ప్రయోగాత్మకంగా ఆరంభిస్తారు. మలిదశలో హైదరాబాద్‌కూ పరిచయం చేసే ఆలోచన ఉన్నట్టు తెలుస్తున్నది. కాకపోతే, అన్ని కమర్షియల్ ఫార్ములాలకు ఉన్నట్టే.. ఇక్కడా షరతులు వర్తిస్తాయి. ఒకే రోజు రెండు సినిమాలు చూడటానికి వీల్లేదు. గోల్డ్‌ప్లస్ లాంటి ప్రత్యేక విభాగాలలో అనుమతి లేదు. ఇలాంటివే చిన్నాచితకా చికాకులు ఉంటాయి. సినిమా అభిమానులు వాటన్నిటినీ ఎత్తిచూపుతున్నారు. నిజానికి ఇదేం సరికొత్త ప్రయోగం కాదు. విదేశాలలో ఎప్పటినుంచో ఉంది.
అక్కడ ‘అన్ లిమిటెడ్’
దసరా తర్వాతో, వేసవి సెలవులు ముగిశాకో పిల్లలు బడికెళ్లడానికి మొరాయిస్తారు. దీంతో బిడ్డల్ని దారికి తెచ్చుకోవడానికి ఏ చాక్లెట్ ముక్కో చేతిలో పెడతారు తల్లిదండ్రులు. కొవిడ్ తర్వాత.. థియేటర్ అనుభూతికి దూరమైన ప్రేక్షకులకు పాత రోజుల్ని గుర్తుచేయడానికి.. మల్టీప్లెక్స్‌లు ‘సబ్స్క్రిప్షన్’ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. గత రెండేళ్ల నుంచీ కొన్ని సినిమా సంస్థలు ‘నేషనల్ సినిమా డే’లాంటి ప్రత్యేక సందర్భాలలో నామమాత్రపు ధరకే టికెట్లు ఇస్తున్నాయి. ఈ మధ్య ఓ తెలుగు సినిమాకు వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ కూడా ఇచ్చారు. విదేశాల విషయానికొస్తే.. కొన్ని అమెరికన్ మల్టీప్లెక్స్‌లో వారానికి మూడు సినిమాలకు అనుమతి ఇస్తున్నాయి. యూకేలో ఓ సంస్థ నెలలో ఏ సినిమాను, ఎన్నిసార్లయినా చూసే అవకాశం కల్పిస్తున్నది. నగరాన్ని బట్టి సబ్స్క్రిప్షన్ మొత్తం మారుతుందంతే. ఈలలు, కేకలు, చప్పట్లు, బొమ్మ అదిరిపోతే కనుక.. శుభం కార్డు పడుతున్నప్పుడు.. స్టాండింగ్ ఒవేషన్లు. మధ్య మధ్యలో కూల్‌డ్రింక్స్ సమర్పయామి! హఠాత్తుగా ఏ పాత స్నేహితుడో కనిపిస్తే కాఫీ కబుర్లు. ఆ రెండున్నర గంటలూ ఓ కొత్త ప్రపంచంలో విహరిస్తాం. అనేక కారణాలతో ప్రేక్షకుడు ఈ అనుభూతికి దూరం అవుతున్నాడు. వెండితెర వెలవెలబోతున్నది. దీంతో ప్రేక్షకదేవుడిని థియేటర్‌కు రప్పించే దిశగా తొలి అడుగే.. సబ్స్క్రిప్షన్ మాడల్.
Vishwa Bharath | ఒకప్పుడు ఊబకాయంతో బాధపడ్డాడు.. ఇప్పుడు సెలబ్రెటీలకే ఫిట్నెస్ ట్రైనర్ అయ్యాడు!!
“Tailor | ఈ దర్జీలు డ్రెస్సులు కుడితే ఆ దర్జానే వేరు.. అందుకే సెలబ్రెటీలు కూడా వాళ్ల వెంట పడతారు!”