దేశంలో స్టార్టప్ కల్చర్ విస్తరిస్తున్నది. కొత్త ఆలోచనలు వెల్లువెత్తుతున్నాయి. నవతరం ఆంత్రప్రెన్యూర్స్ దూకుడుగా ముందుకెళ్తున్నారు. పెట్టుబడులు పెట్టడానికి వెంచర్ క్యాపిటల్ సంస్థలూ సిద్ధంగా ఉన్నాయి. కానీ, సమస్యంతా బ్రాండింగ్తోనే. ఓ ఉత్పత్తి మార్కెట్లో వేళ్లూనుకోవాలంటే చాలా సమయం పడుతుంది. దీనికి కూడా ఇన్స్టంట్ కాఫీలాంటి పరిష్కారం ఉంది.. సెలెబ్రిటీలను వ్యాపార భాగస్వాములుగా చేసుకోవడం. ఫలానా కంపెనీకి ఫలానా స్టార్ సహ- వ్యవస్థాపకుడు అనే ముద్ర చాలు.
ఫిన్‌టెక్.. ఫైనాన్షియల్ టెక్నాలజీ. సాస్.. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఏఐ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. ..తదితర రంగాలు యువతను ఆకర్షిస్తున్నాయి. కొత్త ఐడియాల వైపు ఉసిగొల్పుతున్నాయి. ఆ ఐఐటీ పట్టాలను చూసో, ఆ ఆలోచనలు నచ్చో, ప్రాజెక్ట్ రిపోర్టులకు ఆకర్షితులైపోయో.. ఇన్వెస్టర్లు కోట్లకు కోట్ల్లు కుమ్మరించడానికి సిద్ధపడుతున్నారు. దీంతో నిధులకు ఇబ్బంది లేకుండా పోతున్నది. ఫలితంగా అంకుర సంస్థలు బ్రాండింగ్ మీద దృష్టిపెడుతున్నాయి. అప్పటికే అక్కడ పాతుకుపోయిన దిగ్గజాలను కాదని కస్టమర్లు తమవైపు రావాలంటే.. ఏదో ఓ కొత్తదనం చూపించాల్సిందే. ఉత్పత్తిలో నవ్యత, నాణ్యత ఒక్కటే సరిపోదు. మార్కెట్‌ను కట్టిపడేసే అయస్కాంత శక్తి కూడా కావాలి. ఆ ఆకర్షణ సినిమా, క్రికెట్ సెలెబ్రిటీల దగ్గర పుష్కలం. దీంతో ఎంతోకొంత వాటా ఇచ్చి భాగస్వాములుగా చేర్చుకుంటున్నారు. ఇది ఫలానా క్రికెటర్ కంపెనీ, ఇది ఫలానా సినిమా తార వెంచర్.. అనే విషయం జనంలోకి వెళ్లగలిగితే చాలు. వందేండ్ల చరిత్ర కలిగిన బ్రాండ్స్ అయినా గ్లామర్ దెబ్బకు చిన్నబోవాల్సిందే. ప్రచార బాధ్యత, బ్రాండింగ్ భుజానికి వేసుకున్నందుకు.. సెలెబ్స్కు పది నుంచి పదిహేను శాతం వాటా దక్కుతుంది. ఏ బహుళజాతి సంస్థ కన్నోపడితే నోట్ల వర్షమే. ఎవరికి తెలుసు, అన్నీ కలిసొచ్చి ఐపీవోకు వెళ్తే.. లాభాలే లాభాలు. ఎన్ని సినిమాలు చేస్తే అంత డబ్బు రావాలీ?
ఇది నాణానికి మరో వైపు. గ్లామర్ ప్రపంచం మహా చిత్రమైంది. విజయాలు ఉన్నంతకాలమే అవకాశాలు. స్టార్డమ్ కనుమరుగైపోగానే.. పలకరించే నాథుడే ఉండడు. కాబట్టి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. రియల్ ఎస్టేట్, షేర్లు, బంగారం, బంగళాలు.. ఎలానూ ఉంటాయి. అదనంగా స్టార్టప్స్‌లో కూడా పెట్టుబడులు పెడితే.. ఆంత్రప్రెన్యూర్, బిజినెస్ మ్యాన్ అనే పేరు వస్తుంది. భవిష్యత్తులో లాభాలూ వస్తాయి. ఆ ముందుచూపుతోనే తారలు వినూత్నమైన వెంచర్స్‌లో డబ్బు పెడుతున్నారు. లేదంటే ఇప్పటికే తమ ఉనికిని చాటుకున్న కంపెనీల్లో వాటా తీసుకుంటున్నారు. ఈ మధ్యే కరీనా కపూర్ ‘ప్లక్’ అనే స్టార్టప్‌లో భాగస్వామి అయ్యారు. క్రికెటర్ హార్దిక్ పాండ్య పిల్లల పాదరక్షల స్టార్టప్ ‘అరెట్టో’లో గణనీయమైన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశారు. ‘కరీనా రాకతో మా దశ తిరిగింది. మా గురించి తెలుసుకోడానికి గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు’ అంటారు ప్లక్ సీయీవో ప్రతీక్ గుప్తా. ఈ ఏడాది కాలంలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, శిల్పా శెట్టి, అనుష్కా శర్మ సహా దాదాపు ఇరవై ఎనిమిది మంది సెలెబ్రిటీలు దాదాపు డబ్భు మూడు స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అలియా భట్‌కు అలంకరణ మీద ఉన్న ప్రేమే.. నైకాలో పెట్టు బడుల వైపు నడిపింది. శిల్పా శెట్టికి సేద్యం పట్ల ఉన్న మమకారమే ‘కిసాన్ కనెక్ట్’లో పెట్టు బడులు పెట్టించింది. పుట్టుకతోనే ఎవరూ సినిమా తారలో, క్రికెట్ వీరులో కాలేదు. వాళ్లకూ ఏవో కలలు ఉంటాయి. ఆసక్తులు ఉంటాయి. వాటిని నిజం చేసుకోడానికి తమ భావాలకు దగ్గరగా ఉన్న వ్యాపార సంస్థలను ఎంచుకుంటున్నారు చాలామంది.
మొదట్లో అంతా బాగానే ఉంటుంది. తారలు మురిసిపోతారు. ఇన్వెస్టర్లు సంబరపడతారు. కస్టమర్లు పొంగిపోతారు. వ్యాపారం ఊపందుకోగానే.. సంస్థ మీద పట్టు కోసం ఇరువర్గాల నుంచీ ప్రయత్నాలు మొదలవుతాయి. తామే పునాదులు కాబట్టి తమ మాట నెగ్గాలనుకుంటారు వ్యవస్థాపకులు. తమ వల్లే ఇంత పేరు వచ్చింది కాబట్టి, తమ ఆలోచనలకు విలువ ఇవ్వాలని సెలెబ్రిటీలు ఆశిస్తారు. ప్రొఫెషనలిజంకూ, స్టార్డమ్కూ మధ్య పోరు మొదలవుతుంది. ఇక్కడ ఇంకో సమస్యా ఉంది. సమాజం అతి సున్నితంగా మారిపోయింది. సినిమాను సినిమాగా చూడటం ఎప్పుడో మరిచిపోయారు జనం. సోషల్ మీడియా పుణ్యమాని తారల వ్యక్తిగత జీవితాలు రచ్చబండ చర్చల వరకూ వస్తున్నాయి. ప్రేమలు, విడాకులు, నేర సామ్రాజ్యాలతో సంబంధాలు.. ఉండనే ఉన్నాయి. తెలిసో తెలియకో ఏ వివాదంలోనో చిక్కుకుంటే.. ఆ తారతో ముడిపడిన వ్యాపారాలపైనా ప్రభావం పడుతున్నది. ఆ కంపెనీ మీద కేసు పెట్టాలనో, మూసేయాలనో ధర్నాలు మొదలవుతున్నాయి. అప్పటిదాకా తెచ్చుకున్న పేరు, మూటగట్టుకున్న బ్రాండ్ వాల్యూ.. రాత్రికి రాత్రే మాయమైపోతాయి. ఒకటిరెండు స్టార్టప్స్ ఇలాంటి చేదు అనుభవాలనూ చవిచూశాయి. సినిమా జయాపజయాల్ని ఊహించడం ఎంత కష్టమో.. స్టార్టప్ గెలుపును అంచనా వేయడమూ అంతే అసాధ్యం. దేనికైనా సిద్ధం అనుకున్నప్పుడే.. అక్కడ కాల్షీట్స్ ఇవ్వాలి, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి.
“Tailor | ఈ దర్జీలు డ్రెస్సులు కుడితే ఆ దర్జానే వేరు.. అందుకే సెలబ్రెటీలు కూడా వాళ్ల వెంట పడతారు!”