బంజారాహిల్స్ : అధికార పార్టీ అండదండలతో తెలంగాణ (Telangana) వ్యాప్తంగా భూకబ్జాదారులు రెచ్చిపోతున్నారు. మారుమూల ప్రాంతాల్లోనే కాదు నగరం నడిబొడ్డున సైతం ప్రభుత్వ స్థలాలు (Government Lands) కనపడితే గద్దల్లా వాలిపోతున్నారు. తెర వెనుక ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఇస్తున్న ప్రోత్సాహంతో కబ్జాదారులు మరింత బరితెగిస్తున్నారు. రెవెన్యూ శాఖ (Revenue department) లోని కొంతమంది ఉన్నతాధికారులను, పోలీస్ శాఖ (Police department) లో పనిచేస్తున్న అధికారులను మచ్చిక చేసుకుని ఖరీదైన ప్రభుత్వ స్థలాలను కాజేసేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు.
తాజాగా షేక్‌పేట మండల పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోగల తట్టికాన సెక్షన్ జలమండలి రిజర్వాయర్‌ను ఆనుకొని ఉన్న ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు నెలన్నర క్రితం పార్థసారథి అనే వ్యక్తి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారాన్ని ‘నమస్తే తెలంగాణ’ పత్రిక వరుస కథనాలతో వెలుగులోకి తీసుకురావడంతో స్పందించిన జలమండలి, విజిలెన్స్, హైడ్రా అధికారులు, జిల్లా రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగాయి. స్థలంలో తిష్ట వేసిన పార్థసారథి అనే ల్యాండ్ గ్రాబర్తోపాటు ఆయన అనుచరులను బయటికి పంపించేశారు.
స్థలం చుట్టూ ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. స్థలంలో అడుగడుగునా పార్థసారథి అనుచరులు ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు, ఇతర నిర్మాణాలను తొలగించారు. జలమండలి కోసం కేటాయించిన 1.20 ఎకరాల స్థలాన్ని ఆ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ విజిలెన్స్ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ప్రభుత్వ స్థలంలో తిష్ట వేసిన ప్రైవేటు వ్యక్తులను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గత డిసెంబర్ 24న షేక్‌పేట మండల తహసిల్దార్ అనితారెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేశారు.
అయితే ప్రభుత్వంలోని కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తుల జోక్యంతో తమపై కేసులు నమోదు కాకుండా చూసుకున్న పార్థసారథి అండ్ గ్యాంగ్ మూడు రోజుల క్రితం మరోసారి రంగంలోకి దిగింది. జలమండలికి కేటాయించిన స్థలం బయట ఏర్పాటు చేసిన బోర్డును తొలగించగా అక్కడే ఉన్న విజిలెన్స్ సిబ్బంది వారితో వాగ్వాదానికి దిగారు. కొత్తగా మరోసారి బోర్డు ఏర్పాటు చేశారు. కాగా ఈ వ్యవహారంపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేస్తామని చెప్పినా ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఇదే అదునుగా తీసుకున్న కబ్జాదారులు జలమండలి స్థలం పక్కన ఉన్న మూడున్నర ఎకరాల ప్రభుత్వ స్థలంలో మరో మారు తిష్ట వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
సుమారు పదిమంది గూండాలు ప్రభుత్వ స్థలంలోని కొండరాళ్ల వెనకాల టెంట్లు వేసుకొని మరీ రాత్రిపూట పహారా కాస్తున్నారు. మద్యం సేవిస్తూ , బిర్యానీలు తింటూ రెండు రోజులుగా అక్కడే ఉంటూ ఎవరైనా అక్కడికి వస్తే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వేట కుక్కలను తమతోపాటు ఉంచుకుని ఎవరూ లోనికి రాకుండా స్థలాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నారు. గతంలో ప్రభుత్వ స్థలం అంటూ రాసిన బోర్డులను తుడిచివేశారు. స్థలం చుట్టూ ఉన్న రేకుల మీద మతపరమైన జెండాలు సైతం పెట్టడంతోపాటు లోపల అవులు, ఎద్దులను పెట్టి ఈ స్థలం తమదే అంటూ బిల్దర్లకి చూపిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ జోక్యం చేసుకోవాలని, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్న వారిపై కేసు నమోదు చేసి స్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
Donald Trump | గాజా స్ట్రిప్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన..!
Auto driver | నటుడు విజయ్ పార్టీలో ఆటో డ్రైవర్‌కు కీలక పదవి
Rahul Gandhi | ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణం చేసిందెవరు..? : రాహుల్‌గాంధీ
Gold price | అమెరికా, చైనా ట్రేడ్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న బంగారం ధరలు
IT Employee | మాదాపూర్‌లో బిల్డింగ్‌పై నుంచి దూకి ఐటీ ఉద్యోగి ఆత్మహత్య..
Rahul Dravid | నడిరోడ్డుపై ఆటో డ్రైవర్‌తో రాహుల్ ద్రవిడ్ వాగ్వాదం.. వీడియో వైరల్
Maha kumbha Mela | మహాకుంభమేళా.. 39 కోట్ల మంది పుణ్యస్నానాలు