Strait of Hormuz : పశ్చిమాసియాలో ఇరాన్ (Iran) కు, ఇజ్రాయెల్ (Israel)-అమెరికా (USA) బలగాలకు మధ్య యుద్ధం జోరుగా సాగుతోంది. దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం (Middle East) దద్దరిల్లుతోంది. అయితే ఇజ్రాయెల్, అమెరికా బలగాలు తమపై దాడులు చేసి తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) ని హతమార్చడంపై ఇరాన్ గుర్రుగా ఉంది. అందుకు ప్రతిగా ప్రపంచంలో ఇంధన సరఫరాకు జీవానాడి లాంటి హార్ముజ్ జలసంధిని మూసివేసింది.
శత్రుదేశాల నౌకలు హార్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తే పేల్చేస్తామని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. అంతకుముందే అమెరికాకు అనుకూలంగా ఉండే పలావు దేశానికి చెందిన జెండాతో వెళ్తున్న ఓ చమురు నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఆ నౌకలో 15 మంది భారతీయులు, నలుగురు ఇరానీలు ఉండగా.. ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. ఇరాన్ హెచ్చరికలు, దాడుల నేపథ్యంలో పలు చమురు నౌకలు అనుమతి కోసం హార్ముజ్ జలసంధికి రెండు వైపుల నిలిచిపోయాయి.
ఈ క్రమంలో ఇరాన్.. చైనా చమురు నౌకలు హార్ముజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి చైనా తమకు అనుకూలంగా ఉన్నందున తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ క్రమంలో ఇవాళ భారత చమురు నౌకలకు హార్ముజ్ జలసంధిని దాటేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే అక్కడ వేచి ఉన్న 37 భారత నౌకలు, 1109 మంది నావికులు జలసంధిని దాటే అవకాశం లభించినట్లవుతుంది. ఇది భారత్కు గొప్ప ఊరట అని చెప్పవచ్చు.