న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రివిలేజ్ నోటీసు అందజేశారు. ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె తన నోటీసులో కోరారు. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణనగర్‌లో ఉన్న సర్క్యూట్ గెస్ట్ హౌజ్ నుంచి ఆగస్టు 14వ తేదీ రాత్రి ఆమెను అధికారులు బయటకు గెంటివేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన నేపథ్యంలో స్పీకర్ బిర్లాకు ముగ్గురు అధికారులపై మహువా ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. లోక్‌సభ వ్యవహారాలు రూల్ 222 ప్రకారం ఆమె నోటీసు అందజేశారు. నదియా జిల్లా మెజిస్ట్రేట్ శ్రీకాంత్ పల్లి, అదననపు జిల్లా మెజిస్ట్రేట్ నిరుపేంద్ర సింగ్, నజరేత్ డిప్యూటీ కలెక్టర్ అనామికా బేరా ప్రవర్తన సరిగా లేదని ఆమె తన నోటీసులో పేర్కొన్నారు.
తన పార్లమెంటరీ విధులను ఆ అధికారులు అడ్డుకున్నట్లు ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో స్పీకర్ తనకు రక్షణ కల్పించాలని ఆమె తన నోటీసులో కోరారు. ఆగస్టు 14వ తేదీన సాయంత్రం 6.15 నిమిషాలకు నదియా సర్క్యూట్ హౌజ్‌కు చేరుకున్నానని, తనకు రూమ్ ఇచ్చారని, రాత్రి 7 గంటలకు టీ ఇచ్చారని, 9.20 నిమిషాలకు డిన్నర్ సర్వ్ చేశారని, కానీ 9.47 నిమిషాలకు తన నదియా అదనపు జిల్లా మెజిస్ట్రేట్ నుంచి ఫోన్ వచ్చిందని, రూమ్‌ను ఖాళీ చేయాలని ఫోన్ చేసినట్లు మహువా మొయిత్రా పేర్కొన్నారు. కారణం ఏంటో చెప్పాలని కోరగా, ఉన్నత అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు చెప్పారన్నారు.
సర్క్యూట్ హౌజ్ అందుబాటులో ఉండదని ఆగస్టు 12వ తేదీనే మెసేజ్ ఆదేశాలు ఇచ్చినట్లు నజారత్ డిప్యూటీ కలెక్టర్ నుంచి మహువాకు మెసేజ్ వచ్చింది. ఆ సర్క్యూట్ హౌజ్‌లో యాన్యువల్ మెంటేనెన్స్ , క్లీనింగ్ చేయనున్నట్లు చెప్పారు. ఆగస్టు 13వ తేదీ కన్నా ముందు బుకింగ్ చేసిన వారికి మినహాయింపు ఇవ్వనున్నారు. కానీ ఆగస్టు 12వ తేదీన ఆదేశాలు ఇస్తే, 14న రాత్రి 10 గంటల వరకు ఎందుకు అధికారులు వేచి చూశారని మహువా ప్రశ్నించారు.
మహిళా ఎంపీని రాత్రి వేళ రూమ్ ఖాళీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం .. తమ హక్కులను ఉల్లంఘించినట్లే అవుతుందని, అధికారంలోని ప్రభుత్వం మహిళల భద్రత, సేఫ్టీని విస్మరించినట్లు ఆమె తన నోటీసులో పేర్కొన్నారు. ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకునేందుకు తన నోటీసును ప్రివిలేజ్ కమిటీకి ఫార్వర్డ్ చేయాలని మహువా స్పీకర్ బిర్లాను కోరారు.