మామిళ్లగూడెం, సెప్టెంబర్ 22: జాతీయ రహదారుల కోసం అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెల చివరి వరకు పూర్తి చేస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సీఎం రేవంతరెడ్డి.. జాతీయ రహదారులకు అవసరమైన భూ సేకరణపై కలెక్టర్లతో ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎస్ రామకృష్ణారావులతో కలిసి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఎన్‌హెచ్ 163జీలో భాగంగా 12 కిలోమీటర్ల మేర రోడ్డు వేసేందుకు 42 హెక్టార్ల భూ సేకరణ చేయాల్సి ఉందని తెలిపారు.
ఇందుకోసం కొదుమూరులో రైతులతో చర్చిస్తున్నామని, వారిని ఒప్పించి పెండింగ్‌లో ఉన్న 2.6 కిలోమీటర్ల భూ సేకరణను ఈ నెలలోనే పూర్తి చేస్తామన్నారు. మల్లెమడుగు, రేగులచలక రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ఎన్‌హెచ్ నుంచి పరిహారం చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని, సదరు గ్రామస్తులతో మాట్లాడి బ్యాంకు వివరాలు తీసుకొని అక్టోబర్ 15 నాటికి భూ బదలాయింపు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో డీఎఫ్‌వో సిద్ధార్థ విక్రమ్‌సింగ్, ఎన్‌హెచ్ ఈఈ యుగేందర్, కలెక్టరేట్ భూ సేకరణ విభాగం అధికారులు పాల్గొన్నారు.