నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో రైతులు యూరియా కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. పొద్దున్నే వెళ్లినా భారీ క్యూలో సంచులు దొరకపోవడంతో… రాత్రే వెళ్లి క్యూ కడుతున్నారు. రైతువేదికలు, సొసైటీల వద్దనే జాగారం చేస్తున్నారు. పంటను కాపాడుకోవాలనే ఆరాటంతో వాన, చలిని భరిస్తున్నారు. గంటల తరబడి పడిగాపులు కాసినా బస్తా ఎరువు కూడా దొరకకపోవడంతో ఆగ్రహంతో రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. పలుచోట్ల రైతులు సొమ్మసిల్లిపడిపోతున్నారు.
కాంగ్రెస్ సర్కారు వైఫల్యంతోనే అన్నదాతలు అవస్థలు పడుతున్నారని రైతులు, రైతు సంఘాల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ వైపు అన్నదాతలకు బస్తా యూరియా దొరకక బాధ పడుతుంటే.. ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతో అక్రమార్కులు యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. రైతులు యూరియా కోసం రోజుల తరబడి పడిగాపులు కాస్తుంటే… ప్రభుత్వం సరిపడా స్టాక్ సరఫరా చేయడంలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
డప్పుకొట్టి చెప్తున్నా వినపడ్తలేదా?
ఖమ్మం జిల్లా చింతకాని సొసైటీ పరిధిలోని జగన్నాథపురం రైతు వేదిక వద్దకు చేరుకున్న పలుగ్రామాల రైతులకు కూపన్లు ఇచ్చిన రైతుల్లో చాలామందికి యూరియా ఇవ్వకపోవడంతో.. డప్పులు కొడుతూ ఆందోళనకు దిగిన కర్షకులు
ఎరువు లేదు.. కునుకులేదు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద అర్ధరాత్రి నుంచే క్యూకట్టిన మహిళా రైతులు
సోయిలేని పాలనలో సొమ్మసిల్లిన మహిళా రైతు!
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజపల్లి సొసైటీ ఎదుట క్యూలో సొమ్మసిల్లి పడిపోయిన మహిళా రైతు అనూష
రైతులకు మోసం..ఏఈవో చేతివాటం
హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని నాగారం క్లస్టర్ ఏఈవో కాటం రాజు కమలాపురం మండలం శనిగారం గ్రామానికి చెందిన తన బంధువులకు తరలిస్తుండగా స్థానిక రైతుల సమాచారంతో పోలీసులు పట్టుకున్న 8 బస్తాల యూరియా