నీకో ఫ్రెండ్ ఉన్నాడు. తను కలిసిన ప్రతిసారీ జీవితంలో ఓ మెట్టు పైకి ఎక్కుతున్నావ్. ఈ క్రమంలో నువ్వు అలసిపోయి ఆగిపోతే ఆ ఫ్రెండ్ నీ ప్రయాణం ఆగకుండా మరో చాన్స్ తీసుకువస్తున్నాడు. అలాంటి ఫ్రెండ్‌ని నువ్వు ఇష్టపడతావా? అతనికి భయపడతావా? అంటే, ఊరుకో బాస్ అలాంటి దోస్తుకి ఎవరైనా భయపడతారా? ఇష్టపడతారు గానీ అంటారు కదా! మరి పరీక్ష అంటే భయమెందుకు బ్రో.. మనం చెప్పుకొన్న ఫ్రెండ్ ప్లేస్‌లో పరీక్షను పెట్టి చూడు. తను అలాగే చేస్తుంది కదా! పరీక్ష రాసిన ప్రతిసారీ నువ్వు పై తరగతికి వెళ్తున్నావ్. ఎప్పుడైనా ఫెయిల్ అయితే సప్లీ ఉంటుంది కదా! రాసి నెక్ట్స్ లెవెల్‌కి వెళ్తున్నావ్ కదా.. ఫ్రెండ్ కంటే ఏం తక్కువ చేస్తుంది పరీక్ష. మరి దానికెందుకు భయపడుతున్నావ్. ఒక్కసారి ఆలోచించు.. పరీక్షని ఎనిమీలా కాకుండా ఓ బెస్ట్ ఫ్రెండ్‌లా చూస్తే విజయం నీదే. ఈ వారంలోనే ఇంటర్ పరీక్షలు మొదలవుతున్నాయి. మరో రెండు వారాలకు పదో తరగతి బోర్డు పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. పరీక్షలు దగ్గరికొచ్చాయని కంగారొద్దు బంగారు కొండలు. పరీక్ష రూపంలో ఎదురవుతున్న మీ ఫ్రెండ్‌ను మనస్ఫూర్తిగా కలవండి. తలబడి కాదు.. నిలబడి గెలవండి.
పరీక్ష.. ఈ చిన్నమాట వినిపిస్తే విద్యార్థి మనసులోకి ఆందోళన, ఒత్తిడి అతిథుల్లాగా వచ్చేస్తాయి. అసలు పరీక్షలు అంటే ఎందుకంత ఒత్తిడి? అదేమీ సప్త సముద్రాలను ఈదటం కాదే! ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కడం అంతకన్నా కాదే!! ఏడాదంతా శ్రద్ధగా చదువుకున్న పాఠాలను సాధ్యమైనంత సమగ్రంగా కాగితం మీద పెట్టడం. ఈమాత్రం దానికి అంత కంగారు ఎందుకు? విద్యార్థి పరిజ్ఞానాన్ని బేరీజు వేయడమే పరీక్ష ఏకైక ఉద్దేశం. ముప్పుతిప్పలు పెట్టాలనో, మూడు చెరువుల నీళ్లు తాగించాలనో, ఎలాగో అలా ఫెయిల్ చేయాలనో పరీక్షలు పెట్టరు. బాగా చదువుకున్న విద్యార్థులు మార్కులతో పాసై మరో మెట్టు పైకెక్కడానికే ఈ పరీక్షలు.
పాజిటివ్ సవాల్
పరీక్ష అనేది విద్యార్థికి ఓ పాజిటివ్ సవాల్. దాని గురించి నెగిటివ్‌గా ఆలోచిస్తే తీవ్రమైన సమస్య, కత్తి మీద సాము, ఏటికి ఎదురీదినంత కష్టం. పాజిటివ్‌గా ఆలోచిస్తే ఓ నిచ్చెన మెట్టు. చేయి పట్టుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కించే మిత్రుడిలా కనిపిస్తుంది. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. అందుకే పరీక్షలను పాజిటివ్‌గానే తీసుకోవాలి, పాజిటివ్‌గానే ఎదుర్కోవాలి. ఆధునిక జీవితంలోని ప్రతి కోణంలో ఏదో ఒక రూపంలో ఎంతోకొంత ఒత్తిడి ఉండే తీరుతుంది. తట్టుకోవడం నేర్చుకోవాలి, పాజిటివ్‌గా మార్చుకునే ప్రయత్నం చేయాలి. మంచి మార్కులు రావేమోనన్న నెగిటివ్ ఆలోచనను మంచి మార్కులు తెచ్చుకోగలనన్న పాజిటివ్ ఆలోచనగా మార్చాలి.
గణాంకాలు ఏం చెబున్నాయి?
ఇటీవలి నివేదికలు, గణాంకాల ప్రకారం విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతున్నది. కొన్ని సర్వేల ప్రకారం, సుమారు 86% మంది విద్యార్థులు పరీక్షల సమయంలో ఏదో ఒకరకమైన ఆందోళనకు గురవుతున్నారు. ప్రతి ఐదుగురు విద్యార్థులలో ఒకరు నిరంతరం ఒత్తిడికి లోనవుతున్నారని, వారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేకపోతున్నారని ఐసీ3 ఇన్స్టిట్యూట్ (2025) నివేదిక వెల్లడించింది. గ్రేడ్ 12 (ఇంటర్మీడియట్) చదివే విద్యార్థులలో దాదాపు 75% మంది పరీక్షల సమయంలో రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ర్టాలలో విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులలో కేవలం 41% మంది మాత్రమే సహాయం కోసం ఎవరినైనా సంప్రదిస్తున్నారు. స్కూల్ టీచర్లు లేదా కౌన్సెలర్లను సంప్రదించడానికి దాదాపు 60% మంది విద్యార్థులు భయపడుతున్నారు, అసౌకర్యంగా ఫీలవుతున్నారు. ఈ గణాంకాలను విశ్లేషిస్తే… విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే కాదు, మానసిక ధైర్యం కూడా చాలా అవసరమని, పరీక్షల పట్ల పాజిటివ్ దృక్పథం పెంచాలని స్పష్టమవుతున్నది.
కొంచెం ఒత్తిడి మంచిదే..
ఒత్తిడిని దెయ్యం లాగానో, భూతం లాగానో ఊహించుకోకూడదు. ఆ మధ్య మరక మంచిదే అంటూ ఓ యాడ్ వచ్చింది, చూసే ఉంటారు కదా! అలాగే ఒత్తిడి కూడా ఓ కోణంలో మంచిదే! విద్యార్థులు పరీక్షలు రాయడానికి, వారి సామర్థ్యాన్ని వెలికి తీయడానికి ఓ మోస్తరు ఒత్తిడి అవసరమే. దీన్ని యూస్ట్రెస్ అంటారు. ఈ కొద్దిపాటి ఒత్తిడి లేకపోతే విద్యార్థుల్లో ప్రేరణ కలగదు. ఈ ఒత్తిడి మోతాదు మించితేనే సమస్య మొదలవుతుంది.
లక్షణాలు ఇవీ..
పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనవ్వడం సహజమే, కానీ అది చదువుపై ప్రభావం చూపకముందే గుర్తించడం ముఖ్యం. పరీక్షల ఒత్తిడి వల్ల కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇలా ఉంటాయి.
శారీరక లక్షణాలు: ఒత్తిడి కేవలం మనసుకే కాదు, శరీరానికి కూడా అలసటను కలిగిస్తుంది. సరిగ్గా నిద్ర పట్టకపోవడం లేదా అర్ధరాత్రి మెలకువ రావడం, తరచుగా తలనొప్పి లేదా కళ్లు లాగడం, ఆకలి మందగించడం, కడుపులో వికారం లేదా అజీర్తి, రోజంతా నీరసంగా ఉండటం శక్తి లేనట్లు అనిపించడం పరీక్షల ఒత్తిడి శారీరక లక్షణాలు.
భావోద్వేగ లక్షణాలు: మనసులో కలిగే మార్పులను గమనించండి. నిరంతరం ఏదో తెలియని భయం లేదా టెన్షన్ కలుగుతూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే కోపానికి, అసహనానికి గురవుతూ ఉంటారు. ‘నేను చదవలేనేమో’, ‘పాస్ అవ్వలేనేమో’ అనే ప్రతికూల ఆలోచనలు వెంటాడుతుంటాయి.
ప్రవర్తనలో మార్పులు: చదువుతున్నప్పుడు మనసు ఎక్కడో ఉండటం, చదివింది గుర్తుకు రాకపోవడం. భయం వల్ల చదువును వాయిదా వేస్తూ గడపడం. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఇష్టపడకపోవడం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే యూస్ట్రెస్, డిస్ట్రెస్గా మారిందని గుర్తించాలి. నిపుణుల సాయం తీసుకోవాలి.
ఒత్తిడి ఎందుకు ?
పరీక్షల ఒత్తిడికి కేవలం చదువు మాత్రమే కారణం కాదు, దాని వెనుక సామాజిక, వ్యక్తిగత కారణాలు ఉంటాయి.
వ్యక్తిగత కారకాలు: చాలావరకు ఒత్తిడి మన ఆలోచనా విధానం నుంచే మొదలవుతుంది. సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయకపోవడం లేదా చివరి నిమిషం వరకు చదవడం వాయిదా వేయడం. తనపై తాను అతిగా అంచనాలు పెట్టుకోవడం. కచ్చితంగా టాప్‌ర్యాంక్ రావాలనే పట్టుదల. ‘నేను ఇది చేయలేను’, ‘నాకు గుర్తుండదు’ అనే ప్రతికూల భావనలు. సరైన నిద్ర లేకపోవడం, జంక్ ఫుడ్ తినడం.. ఇలాంటి వ్యక్తిగత కారణాలన్నీ, ఒత్తిడికి గురిచేసేవే!
సామాజిక ఒత్తిడి: చుట్టూ ఉన్నవారు మనపై చూపే ప్రభావం కూడా ఒత్తిడికి కారణం అవుతుంది. పిల్లల సామర్థ్యానికి మించి మార్కులు రావాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం. పక్కింటి పిల్లలు, స్నేహితులతో పోల్చడం వల్ల విద్యార్థుల్లో భయం పెరుగుతుంది. నేటి పోటీ ప్రపంచంలో వెనకబడి పోతామేమో అన్న ఆందోళన పిల్లల్లో ఒత్తిడి కలిగిస్తాయి.
విద్యాపరమైన కారణాలు: చదువుకునే విధానం పరీక్షల పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా ఒక సబ్జెక్టు సరిగ్గా అర్థం కాకపోవడం, చాలా కష్టంగా అనిపించడం. తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ చదవాల్సి రావడం. పరీక్షా హాలులో ఎలా ఉంటుందో, ప్రశ్నలు ఎలా వస్తాయో అనే అభద్రతా భావం ఒత్తిడికి దారి తీస్తాయి.
మెదడులో ఏం జరుగుతుంది?
మన మెదడులో అమిగ్డాలా అనేది భయాన్ని గుర్తించే ఒక చిన్న భాగం. ఇది పరీక్షను ఒక ‘ప్రమాదం’గా భావించినప్పుడు, మన శరీరంలోకి కార్టిసాల్ అడ్రినలిన్ అనే స్ట్రెస్ హార్మోన్లను విడుదల చేస్తుంది. దీనివల్ల మనం ఆందోళనకు గురవుతాము.
ఒత్తిడి హార్మోన్లు పెరిగినప్పుడు, మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే మనం ఆలోచించడానికి, సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించే భాగం తాత్కాలికంగా బలహీనపడుతుంది. అందుకే పరీక్ష హాల్లో బాగా చదివిన సమాధానాలు కూడా ఒక్కోసారి గుర్తుకురావు. దీనినే బ్రెయిన్ ఫ్రీజ్ అంటారు.
మెదడులోని హిప్పోకాంపస్ అనే భాగం కొత్త విషయాలను నేర్చుకోవడానికి, గుర్తుంచుకోవడానికి సాయపడుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి, నిద్రలేమి వల్ల ఈ భాగం దెబ్బతింటుంది, దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. పరీక్షల ఒత్తిడి అనేది మీ మెదడు ఒక సవాలుకు స్పందిస్తున్న తీరు మాత్రమే. సరైన శ్వాసక్రియ, తగినంత నిద్ర, ఆత్మవిశ్వాసంతో మీ మెదడును తిరిగి మీ నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు.
రివిజన్ ఇలా..
చదివింది బాగా గుర్తు పెట్టుకోవాలన్నా, పరీక్షల్లో విజయం సాధించాలన్నా రివిజన్ చాలా ముఖ్యం. ఏ సమాచారాన్ని అయినా నాలుగైదుసార్లు రివిజన్ చేస్తే లాంగ్ టర్మ్ మెమరీగా మారిపోతుంది. ఎక్కువకాలం జ్ఞాపకం ఉంటుంది. అందుకనే తగిన వ్యవధిలో క్రమంతప్పకుండా రివిజన్ చేయడం తప్పనిసరి. చాలామంది విద్యార్థులు రివిజన్ అంటే అంతకుముందు చదివిన దాన్ని మళ్లీ చదవటం అనే పొరపాటు అభిప్రాయంతో ఉంటారు. రివిజన్ అంటే అసలు అర్థం, మెదడులో అప్పటికే నిల్వ ఉన్న సమాచారాన్ని దృశ్య రూపకంలో గుర్తు తెచ్చుకోవడం. ఓ క్రమ పద్ధతిలో రివిజన్ చేయడం ద్వారా పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవడం చాలా ఈజీ. మొదటి రివిజన్ గంటలోపు, రెండో రివిజన్ 24 గంటల లోపు, మూడో రివిజన్ ఒక వారం లోపు చేస్తే ఆ సమాచారం అంతా లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళుతుంది. రాసేటప్పుడు చక్కగా గుర్తుకొస్తుంది.
మానసిక సన్నద్ధత అవసరం..
పరీక్షల ఒత్తిడి ఎదుర్కోవడానికి కొంత మానసిక సన్నద్ధత అవసరం. విద్యార్థికి ఏ లెక్కలో, ఫిజిక్సో, బయాలజీనో శత్రువు కాదు, పరీక్షలు అంటే ఉండే భయమే అసలైన శత్రువు. కొన్ని నియమాలు పాటించడం ద్వారా ఆ భయాన్ని తరిమికొట్టొచ్చు. శారీరకంగానూ, మానసికంగాను ఉత్సాహంగా ఉండాలంటే రోజూ 10 నిమిషాల వ్యాయామం తప్పనిసరి. జాకబ్ సన్ రిలాక్సేషన్, డీప్ బ్రీత్ ఎక్సర్సైజెస్, విజువలైజేషన్ ఇవన్నీ ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఉపకరిస్తాయి. వీటిలో ఏదో ఒకటి సాధన చేయటం మంచిది. పరీక్ష ముందు రోజు ప్రశాంతంగా నిద్రపోయి శరీరాన్ని, మనసుని రిలాక్స్ చేసుకోండి. రేపటి పరీక్షలు చక్కగా రాసినట్లు ఊహిస్తూ నిద్రలోకి జారుకోండి. అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని పరీక్షకు సిద్ధం చేస్తుంది.

ఆందోళనగా ఉంటే ..
పరీక్ష హాల్లో ఉన్నప్పుడు హఠాత్తుగా ఆందోళన కలిగితే, కేవలం రెండు నిమిషాల్లో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా మార్చుకోవడానికి న్యూరోసైన్స్, సైకలాజికల్ టెక్నిక్స్ అద్భుతంగా పనిచేస్తాయి.
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్..
ఇది మీ నరాల వ్యవస్థను సెకన్లలో ప్రశాంతపరుస్తుంది.
ఎలా చేయాలి:
5-4-3-2-1 గ్రౌండింగ్ టెక్నిక్..
మీ మెదడు భవిష్యత్తు గురించి భయపడుతున్నప్పుడు, దాన్ని తిరిగి ప్రస్తుతానికి తీసుకురావడానికి ఇది ఉత్తమ మార్గం.
సైకలాజికల్ సిగ్..
న్యూరోసైంటిస్టులు సూచించే అత్యంత వేగవంతమైన టెక్నిక్ ఇది.
ఎలా చేయాలి: ముక్కుతో ఒకసారి గాలి పీల్చుకున్న వెంటనే, ఆగకుండా మరో చిన్న గాలి పీల్చుకోండి. ఆ తర్వాత నోటి ద్వారా నెమ్మదిగా గాలి వదలండి. ఇలా 2-3 సార్లు చేయండి.
ప్రయోజనం: ఇది ఊపిరితిత్తుల్లోని గాలి గదులను తెరిచి, రక్తంలో కార్బన్ డయాక్సైడ్ను తగ్గించి మెదడును రిలాక్స్ చేస్తుంది.
పాజిటివ్ సెల్ఫ్-టాక్..
పరీక్ష హాల్లో మీకు మీరు ఇలా చెప్పుకోండి.
ఐసోమెట్రిక్ రిలాక్సేషన్..
ఎలా చేయాలి: మీ కుర్చీలో కూర్చుని, మీ పాదాల వేళ్లను గట్టిగా బిగించి 5 సెకన్లు ఉంచండి, ఆపై వదిలేయండి. అలాగే చేతులను కూడా చేయండి.
ప్రయోజనం: శారీరక బిగువును వదలడం వల్ల మెదడుకు ‘రిలాక్స్’ అవ్వమని సంకేతం వెళ్తుంది.
ప్రశ్నపత్రం చూడగానే ఒక్క నిమిషం కళ్లు మూసుకుని వీటిల్లో ఏదో ఒకటి చేయండి. ఆ తర్వాతే రాయడం మొదలుపెట్టండి.
ఆత్మవిశ్వాసంతో అడుగు..
ఒక సూర్య కిరణం ఏదీ సాధించలేదు. ఒక్క భూతద్దం అనేక కిరణాల్ని ఏకం చేసి కాగితాన్ని కాల్చేయగలుగుతుంది. అదీ ఫోకస్‌కు ఉన్న శక్తి. ప్రతీ విద్యార్థి అంతే ఫోకస్‌తో తనలోని భయాలను, అపోహలను బుగ్గిచేసి ఆత్మవిశ్వాసంతో పరీక్షహాల్లో అడుగుపెడితే విజేతగా నిలవడం ఖాయం. విద్యార్థి.. జయీభవ.. విజయీభవ!
పరీక్ష హాలులో ఇలా..
పరీక్ష హాల్లో కూర్చున్న తర్వాత మనసు చలించకుండా స్థిరంగా ఉంచుకోండి. బొడ్డు కింది భాగంలో మీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది, దానిపై అటెన్షన్ ఉంచండి. దీంతో శరీరానికి స్థిరత్వం వస్తుంది. మనసు కూడా స్థిరంగా ఉంటుంది. పరీక్ష హాలులో మీ చుట్టుపక్కల ఉన్నవారిని విచిత్ర వేషధారణలో ఉన్నట్టుగా భావించండి. వారి ముఖాలను ఫన్నీగా ఊహించుకోండి. మీలో మీరు నవ్వుకోండి. దీంతో మీ బాడీలో ఎండార్పిన్లు రిలీజ్ అయి.. మనసును తేలిక పరుస్తాయి. మెదడును చురుకుగా ఉంచుతాయి. ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే సునిశితంగా పరిశీలించండి. ప్రశ్నలలోని పదాలను కళ్లు స్కిప్ చేయకుండా ఉండటానికి, ప్రశ్న కింద వేలు రన్ చేస్తూ చదవండి. ప్రతి ప్రశ్నను ఒకటికి రెండుసార్లు చదవండి. ఏ సమాధానం రాయడానికి ఎంత సమయం కావాలో ముందుగానే నిర్ణయించుకోండి.
రాసిన సమాధానాలు చెక్ చేసుకోడానికి పది నిమిషాలు మిగిలేలా ప్లాన్ చేసుకోండి. మరిచిపోతామనుకున్న ముఖ్యమైన పాయింట్స్‌ను ఆన్సర్ షీట్ చివర్లో రఫ్ వర్క్ అని రాసి నోట్‌చేసి పెట్టుకోండి. మీరు బాగా రాయగలిగిన సమాధానాన్ని మొదట రాయండి. కీలక పదాలను అండర్ లైన్ చేయండి. ఆన్సర్ షీట్ దిద్దేవారికి మీపై మంచి అభిప్రాయం కలుగుతుంది. మంచి మార్కులు వేసే అవకాశం ఉంటుంది. మొదట, చివర మీరు బాగా రాయగలిగే వాటికి సమాధానం రాయండి. మధ్యలో అంతగా బాగా రాయలేని ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మంచి మార్కులు వస్తాయి. ప్రతి అరగంటకు ఓ నిమిషం పాటు విరామం తీసుకోండి. నెమ్మదిగా, బలంగా గాలి పీల్చి వదలటం ద్వారా మీ మెదడుకు ఆక్సిజన్ అంది చురుగ్గా పని చేస్తుంది. మధ్య మధ్యలో కొంచెం మంచినీళ్లు తాగుతూ ఉండండి. హ్యాండ్ రైటింగ్ స్పష్టంగా ఉండేటట్లు చూసుకోండి. సమయం ముగిసే వరకు పరీక్ష హాల్లోనే ఉండండి. ఆన్సర్ షీట్ మొత్తం చెక్ చేసిన తర్వాతనే ఇన్విజిలేటర్‌కు ఇవ్వండి.
పరీక్ష తర్వాత..
పరీక్ష రాసిన తర్వాత హాల్ నుంచి బయటికి వచ్చి తోటి విద్యార్థులతో చర్చించడం మంచిది కాదు. మీరు రాసిన జవాబు తప్పు అని ఎవరైనా అంటే ఆత్మవిశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంటుంది. దాని ప్రభావం మర్నాటి పరీక్షపై పడుతుంది. ఎవరితోనూ రాసిన పరీక్ష గురించి చర్చించవద్దు. తెలియని విషయాలను ఎదుటివారు చెబుతూ ఉంటే మీలో నిరాశ కలుగుతుంది. అది ఏ విధంగానూ లాభం చేకూర్చదు. మరుసటి రోజు రాయాల్సిన పరీక్షపై దృష్టి కేంద్రీకరించండి.

Stress Brain
టైమ్ మేనేజ్మెంట్ ముఖ్యం..
పరీక్షలకు ప్రిపేర్ కావడం ఒక ఎత్తు అయితే, పరీక్ష హాల్లో టైమ్ మేనేజ్మెంట్ మరో ఎత్తు. చాలామంది విద్యార్థులు ఈ విషయంలోనే బోల్తా పడతారు. పరీక్షకు బాగా ప్రిపేర్ అయినా, రాయడానికి టైమ్ సరిపోలేదని వాపోతుంటారు. ప్రిపరేషన్లోనే టైమ్‌ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకుంటే దీని నుంచి బయటపడవచ్చు. ప్రశ్నపత్రం చేతికి రాగానే వెంటనే రాయడం మొదలుపెట్టకండి. మొత్తం పేపర్ చదవండి. అన్ని ప్రశ్నలనూ ఒకసారి స్కాన్ చేయండి. మీకు బాగా తెలిసినవి, కొంచెం ఆలోచించాల్సినవి, బాగా కష్టమైనవి అని మనసులో గుర్తుపెట్టుకోండి. ఇది మీ మెదడుకు ఒక రోడ్ మ్యాప్‌ను ఇస్తుంది. ముందుగా తెలిసినవి రాయండి. మీకు బాగా వచ్చిన సమాధానాలను ముందుగా రాయడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తెలిసిన వాటిని వేగంగా రాయడం వల్ల, కష్టమైన ప్రశ్నల కోసం మీకు అదనపు సమయం దొరుకుతుంది.
ప్రతి 30 నిమిషాలకు ఒకసారి సమయాన్ని చూసుకోండి. మీరు అనుకున్న ప్లాన్ ప్రకారం వెళ్తున్నారో లేదో చెక్ చేసుకోండి. పరీక్ష ముగియడానికి 15 నిమిషాల ముందే రాయడం పూర్తి చేసేలా ప్లాన్ చేసుకోండి. మీ రూల్ నంబర్ సరిగ్గా ఉందా? అన్ని ప్రశ్నలకు నంబర్లు వేశారా? ఏదైనా ముఖ్యమైన పాయింట్ మిస్ అయిందా? అని చెక్ చేసుకోండి.
పేరెంట్స్ సపోర్ట్ కీలకం..
పరీక్షల సమయంలో పిల్లలు పడే ఆందోళనను తగ్గించడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. మీరు ఇచ్చే చిన్న మద్దతు వారిలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.
ప్రయత్నాన్ని గౌరవించండి
చాలామంది తల్లిదండ్రులు కేవలం మార్కులపైనే దృష్టి పెడతారు. కానీ, మీరు పిల్లల ప్రయత్నాన్ని అభినందించండి. ‘నువ్వు పడుతున్న కష్టాన్ని నేను చూస్తున్నాను, అది చాలు’ అని చెప్పండి. మార్కులు తక్కువ వస్తే ఏదో జరిగిపోతుందనే భయాన్ని వారి మనసులోంచి పోగొట్టండి.
ఓపిగ్గా వినండి..
పిల్లలు తమకు అర్థం కాని పాఠాల గురించి లేదా భయం గురించి చెప్పినప్పుడు, సలహాలు ఇచ్చే కంటే ముందు వారు చెప్పేది వినండి. వారి మనసులోని భారాన్ని బయటపెడితే ఒత్తిడి సగానికి సగం తగ్గుతుంది.
సానుకూల సంభాషణ
మీరు వాడే మాటలు వారి ఆలోచనలను మారుస్తాయి. ‘ఇంకా చదవలేదా?’ అనే బదులు, ‘ఇప్పటివరకూ ఎంత పూర్తయ్యింది? ఇంకేమైనా సాయం కావాలా?’ అని అడగండి. వారి పాత విజయాలను గుర్తు చేస్తూ, ‘నువ్వు ఇది చేయగలవు’ అని ప్రోత్సహించండి.

విరామాల ప్రాముఖ్యత
మెదడు నిరంతరం చదవడం వల్ల అలసిపోతుంది. ప్రతీ గంటకు ఓ పది నిమిషాల విరామం తీసుకునేలా చూడండి. ఆ సమయంలో వారితో కలిసి కాసేపు నవ్వడం, సంగీతం వినడం లేదా బాల్కనీలో నడవడం వంటివి చేయండి.
డిజిటల్ డిటాక్స్
పరీక్షల సమయంలో ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. పిల్లలు చదువుకునేటప్పుడు మీరు కూడా ఫోన్లు లేదా సోషల్ మీడియా వినియోగం తగ్గించండి. మీరు పుస్తకాలు చదవడం లేదా ఇంట్లోని పనులు చేసుకోవడం చూస్తే, వారు ఒంటరిగా చదువుకుంటున్నామనే భావన కలగదు.
పరీక్ష రోజు..
పరీక్షా సమయంలో మితాహారం మంచిది. పరీక్షకు రెండు గంటల ముందు తక్కువ మోతాదులో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. పరీక్ష హాల్లోకి వెళ్లే ముందు అరటి పండు తినండి. మెదడుకు కావాల్సిన గ్లూకోజ్ అందుతుంది. పరీక్షకు 15 నిమిషాల ముందు బబుల్ గమ్ నమలండి. దీంతో మెదడు ఉత్తేజితమవుతుంది. హాల్లోకి వెళ్లే ముందు బబుల్ గమ్ ఊసేయండి. పరీక్షా కేంద్రానికి అరగంట ముందు చేరండి. కేంద్రం మొత్తం కలియ తిరగండి. ఇలా చేయడం ద్వారా ఆ ప్రదేశం కొత్తది అనే భావన మీ మనసు నుంచి పోతుంది. ధైర్యం పెరుగుతుంది.
బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261