Nithya Menen | రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా విడుదలైన తర్వాత జాన్వీ కపూర్ పాత్ర చుట్టూ నెలకొన్న వివాదం ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతోంది. సినిమాలో హీరోయిన్ను మరింత గ్లామరస్‌గా చూపించారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో ఈ అంశం పెద్ద చర్చకు దారి తీసింది. పలువురు నెటిజన్లు, సినీ ప్రముఖులు దర్శకులను ప్రశ్నిస్తుండగా, మరికొందరు జాన్వీ కపూర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ వివాదంలో ఇప్పటికే నటీమణులు ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి సహా పలువురు హీరోయిన్లు స్పందించి, హీరోయిన్లను విమర్శించడం కంటే దర్శకులను ప్రశ్నించాలని అభిప్రాయపడ్డారు. జాన్వీ పాత్రపై వచ్చిన విమర్శలు తీవ్రరూపం దాల్చడంతో దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా స్పందించారు. వివాదాస్పదంగా భావిస్తున్న కొన్ని సన్నివేశాలను తొలగిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక తాజాగా ఈ అంశంపై నటి నిత్యా మీనన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. హీరోయిన్లను కేవలం గ్లామర్ కోణంలో చూపించడం ఒక్క తెలుగు సినీ పరిశ్రమకే పరిమితం కాదని, దాదాపు అన్ని చిత్ర పరిశ్రమల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోందని ఆమె అన్నారు. “హీరోయిన్లను గ్లామర్ డాల్స్‌లా చూపించడం టాలీవుడ్లోనే ఎక్కువగా జరుగుతుందనడం సరైన అభిప్రాయం కాదు. ప్రతి ఇండస్ట్రీలోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రేక్షకులను ఆకర్షించడానికి గ్లామర్ అవసరమనే భావనతో కొంతమంది దర్శకులు, నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. సినిమాలు మరింత కమర్షియల్ అవుతున్న కొద్దీ కొన్ని సందర్భాల్లో హద్దులు దాటే పరిస్థితులు ఏర్పడుతున్నాయి” అని నిత్యా మీనన్ పేర్కొన్నారు.
అయితే ఈ విషయంలో కేవలం దర్శకులనే తప్పుబట్టడం సరైంది కాదని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. కొంతమంది హీరోయిన్లు గ్లామర్ పాత్రలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. అదే కారణంగా దర్శకులు కూడా వారిని ఆ కోణంలో చూపిస్తుంటారు. ఇది పూర్తిగా ఒకవైపు జరిగే విషయం కాదు అని అన్నారు. తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా నిత్యా ఈ సందర్భంగా పంచుకున్నారు. గతంలో కొందరు దర్శకులు నన్ను పూర్తిగా గ్లామర్ ఆధారిత పాత్రల కోసం సంప్రదించారు. కానీ అలాంటి పాత్రలు చేయడం నాకు ఇష్టం లేక నేను తిరస్కరించాను. దాని వల్ల కొన్ని పెద్ద సినిమాల్లో అవకాశాలు కోల్పోయినా బాధపడలేదు. స్టార్డమ్ కంటే నా వ్యక్తిగత విలువలు, నేను నమ్మే సిద్ధాంతాలు నాకు ముఖ్యం అని చెప్పారు.
పరిస్థితులు మన అభిరుచికి విరుద్ధంగా ఉన్నప్పుడు ‘నో’ చెప్పగల ధైర్యం ఉండాలి. కానీ కొందరు హీరోయిన్లు టాప్ హీరోయిన్ కావాలనే లక్ష్యంతో లేదా పెద్ద హీరోల సినిమాల్లో అవకాశం కోసం ప్రాధాన్యత తక్కువగా ఉన్న పాత్రలను కూడా అంగీకరిస్తున్నారు. మొదటి నుంచి గ్లామర్ పాత్రల్లో నటిస్తూ వచ్చి, ఒక్కసారిగా అలాంటి పాత్రలు చేయనని చెప్పితే ప్రేక్షకులు కూడా నమ్మరు. చివరికి ఇది ప్రతి హీరోయిన్ వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది అని నిత్యా మీనన్ వ్యాఖ్యానించారు.