‘తెలుగు గజళ్ల’లో “నిలబడి చూస్తుంది తెలుగు పలకలేని కందగా/ ఉరమాలిక కంఠమెత్తి గురజాడే అండగా/… పలురుచులను మరిగిన మా తెలుగుజాతి ఓ ‘సినారె’/ పులకించాలింక తెలుగు పలుకే కలకందగా” అంటూ తెలుగు భాష గురించి ఆవేదన చెందారు సినారె. ‘తెలుగుజాతి మనది, నిండుగ వెలుగుజాతి మనది’ (తల్లా? పెళ్ళామా?) లాంటి సినీ గీతాలు రాశారు. జాతి చేతన గీతిక, భాషా కేతన దీపిక అయిన మరో గీతాన్ని 2009లో సురేశ్ కృష్ణ దర్శకత్వంలో దాసరి నారాయణరావు ప్రధానపాత్రగా రూపొందిన చిత్రం ‘మేస్త్రీ’ చిత్రం కోసం రాశారు.
ఈ గీతం సాకీలో తెలుగు వెలుగును, వెలిగింపజేసిన మహనీయులను గురించి “శాతవాహనుల ఏల్బడిలో/ తొలి అడుగు వేసింది తెలుగు/ కాకతీయుల గొడుగు నీడలో/ కదను తొక్కింది తెలుగు/ కృష్ణరాయల పాలనలో పడగెత్తి నిలిచింది తెలుగు” అంటూ ఆయా కాలాల్లో జరిగిన తెలుగు వికాసాన్ని చెబుతారు కవి. సినారె పుట్టిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోటి లింగాల కేంద్రంగా ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తొలి తెలుగు రాజులు శాతవాహనులు. వారి ఏలుబడిలో ‘తొలి’ అడుగువేసిన తెలుగు భాష ప్రస్థానాన్ని యాది చేస్తూ, కాకతీయ మహాసామ్రాజ్య కాలంలో విస్తరిల్లి, కదం తొక్కిన విధానాన్ని ప్రస్తావిస్తారు సినారె గర్వంగా! ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో కావ్యాలై, ప్రబంధాలై పరిఢవిల్లిన భాషామతల్లి పడగెత్తి నిలిచిందంటారు. అంతేకాదు… నవీనయుగాల్లో అనేక రూపాలు, రీతులై విస్తరిల్లిన తెలుగు గురించి చెబుతారు.
మన మాతృభాష తెలుగు
మన రక్తఘోష తెలుగు
గోదావరీ కృష్ణ తుంగభద్రా నదుల
స్వాదుసలిల క్షీర ధారలే సాక్షులుగ
ప్రఖ్యాత భాష తెలుగు- అత్యంత
ప్రాచీన భాష తెలుగు ॥మన మాతృ॥
ప్రాచీన భారతీయ భాషల్లో తెలుగు ఒకటి. తెలుగు వారసత్వ జీవన వేణులైన గోదావరీ, కృష్ణా నదుల్లాగా ప్రవహిస్తున్న తెలుగుభాష మన ‘రక్తఘోష’గా చెబుతారు సినారె. విశ్వవ్యాప్తమై వర్ధిల్లిన తెలుగు గొప్పదనాన్ని, ఎదలోతుల్లో నిలిచి ఆత్మగౌరవంతో ఎలా తలెత్తుకునేలా మన మాతృభాష మనలను నిలిపిందో తర్వాతి చరణాల్లో చెబుతారు కవి.
కడలి అంచుదాటి
కదిలింది తెలుగు
ఎదల లోతులు మీటి
ఎగిసింది తెలుగు
ఎక్కడున్నా ఎన్ని చిక్కు
లెదురవుతున్నా
తలయెత్తి నిలుపుమని
తెలిపింది తెలుగు ॥మన మాతృ॥
ఏ భాషైనా కాలక్రమంలో తనలో కొత్త పదాలను కలుపుకొని వర్ధిల్లుతుంది. తెలుగు తొలి నుంచి సంస్కృతం మొదలుకుని తమిళం, ఉర్దూ, పారసీతోపాటు ఇతర భాషల పదాలను అక్కున చేర్చుకొని వెలిగింది. అనేక యాసలు, భాషలను మిళితం చేసుకుంది. అనేకమంది కవులు, భాషావేత్తల కృషితో వికసించింది. మందార మకరంద మాధుర్యంతో తూగిన పోతన్న కవిత్వ ఒరవడి, తేటతెలుగు నుడికారంతో ఆటవెలది ఛందస్సును మలిచి జాతిని జాగృతం చేసిన వేమన ధిక్కారంతో తెలుగు ఉరిమిందంటారు కింది చరణంలో..
ఏ భాష చెణుకైన, ఏ యాస చినుకైన
తనలోన కలుపుకొని తరలింది తెలుగు
ఒదిగొదిగి పోతన్న ఒరవళ్లలో సాగి
హుమ్మంటు వేమనగ ఉరిమింది తెలుగు ॥మన మాతృ॥
తెలుగువారి నృత్యమైన కూచిపూడి తెలుగువికాసానికి ఉపకరించిందని చెప్పిన కవి సినారె, త్యాగయ్య పదంగా పాడిన పాట తెలుగును నిలిపిన వాటిలో ఒకటంటారు. ఇంకా, “స్వాతంత్య్ర సమరాన స్వచ్ఛంద గతులీన/ఉగ్రనేత్రం తెరిచి ఉరికింది తెలుగు/శాంతి కపోతమై క్రాంతి జలపాతమై/నిత్య వర్ధిష్ణువై/నిలిచింది తెలుగు” అంటూ జాతి దాస్యశృంఖళాలు తొలగించడంలో ముందు నిలిచిన వందలాది తెలుగువీరుల త్యాగాల్ని మననం చేస్తారు. కవి సినారె తెలుగును ఎంతగా ప్రేమిస్తున్నారో… శ్వాసిస్తున్నారో… తన మాతృభాష తనకు ఎంతగా ఆత్మగౌరవ కేతనంగా భావించారో కింది పంక్తులు చెబుతాయి
తెలుగు ఉచ్ఛ్వాసమై తెలుగు నిశ్వాసమై
తెలుగు ఆవేశమై తెలుగు ఆదర్శమై
తెలుగు విశ్వాసమై తెలుగు విన్యాసమై
తెలుగు ఉల్లాసమై తెలుగు ఉన్మేషమై
తెలుగు నీ జ్ఞానమై తెలుగు నీ ధ్యానమై
తెలుగు నీ గానమై తెలుగు నీ ప్రాణమై
తెలుగు నీ ఉన్నతికి వజ్ర సోపానమై
ఎత్తరా విజయకేతనం
నిలపరా నీ ఆత్మగౌరవం
‘నారాయణరెడ్డి తెలుగు ఆరామంలో సుమించు ఆమనిగాదే/ లేరతనికి పోలిక కర్పూర కళికగా వెలుంగు పున్నమిగాదే’ అంటారు సినారె గురించి డా.ఎన్.గోపి. ‘పంచెకట్టు’తో అచ్చ తెలుగు సంతకంగా వెలిగిన మహాకవి ఆయన. తెలుగు భాష గురించి, తెలుగు జాతి గురించి అనేక సందర్భాల్లో అటు కవిత్వంలో, ఇటు సినీగీతాల్లో రాశారు సినారె. ఆయనతో మూడున్నర దశాబ్దాల సాన్నిహిత్యంలో నన్ను ఎప్పుడైనా మందలించారంటే అది ఆంగ్లపదాలను ఎక్కువగా కవిత్వంలో ఉపయోగించినపుడు మాత్రమే. అంతగా ‘తెలుగాభిమనం’ వారిది. సినారె మహాత్మా గాంధీ సూక్తులను ‘గాంధీయం’ పేరుతో తెలుగులోకి ద్విపదలుగా అనువదించారు. మాతృభాష గురించి గాంధీజీ మాటలను “మాతృభాషా తృణీకారం/ మాతృదేవి తిరస్కారం” అంటూ చెప్పారు సినారె.
– పత్తిపాక మోహన్