ఖైరతాబాద్, మార్చి 8: పదవి ఉన్నన్నాళ్లు పట్టించుకోలేదు.. కాలం ముగియడంతో ఇక పట్టింపేలేదు.. అంటూ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై ప్రేమ్‌నగర్ బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంజారాహిల్స్ డివిజన్ ప్రేమ్‌నగర్‌లో సీసీ రోడ్డు పనులు ముందుకు సాగడం లేదు. రెండేండ్లుగా సివరేజీ, డ్రైనేజీ పైపులైన్ పనుల పేరుతో రోడ్డును అస్తవ్యస్తంగా తవ్వారు. దీనికితోడు అడ్డగోలు తవ్వకాలతో తాగునీరు, డ్రైనేజీ పైపులైన్లు విరిగిపోయాయి. తిరిగి వాటిని సరిచేయడానికి సదరు కాంట్రాక్టర్ ఒక్కొక్కరి వద్ద రూ.2వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
గతనెల 19న రూ.26.25 లక్షల అంచనా వ్యయంతో స్థానిక సాయిబాబా మందిరం నుంచి అంబేద్కర్ చౌరస్తా స్ట్రీట్ నంబర్ 10 వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బల్దియా అధికారులు శ్రీకారం చుట్టారు. ఆ పనులను జూబ్లీహిల్స్ సర్కిల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మోహన్‌రావు ప్రారంభించి 20 రోజుల్లో పూర్తిచేస్తామని బస్తీ వాసులకు హామీ ఇచ్చారు. అయితే రోడ్లు తవ్విన మరుసటి రోజు నుంచి రోడ్డు పనులను అలాగే వదిలేయడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గాయాలపాలవుతున్న విద్యార్థులు..
పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తవ్విన గుంతల్లో తరచూ కిందపడుతూ గాయాలపాలవుతున్నారు. బస్తీలో భూగర్భజలాలు సైతం ఇంకిపోవడంతో నిత్యం ఇక్కడ వాటర్ ట్యాంకర్ల రాకపోకలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వాటర్ ట్యాంకర్.. గుంతలో పడిపోవడంతో దానిని తొలగించేందుకు బస్తీవాసులు నానా తంటాలు పడ్డారు. గద్వాల్ విజయలక్ష్మి మేయర్‌తో పాటు డివిజన్ కార్పొరేటర్ పదవీ కాలం ముగియడంతో ఆమె కనీసం పట్టించుకునే పరిస్థితుల్లో లేరని బస్తీవాసులు ఆరోపిస్తున్నారు. మరో వైపు ఎమ్మెల్యే ఉన్నా ఆయన స్పందించిన దాఖలాలు లేవని అంటున్నారు. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులైన స్పందించి రోడ్డు పనులు పూర్తిచేసి తమ కష్టాలు తీర్చాలని బస్తీవాసులు కోరుతున్నారు.