వెంకటాపూర్, మార్చి 8 : వేసవి కాలం ఇప్పుడిప్పుడే మొదలవుతుండగా.., అప్పుడే ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కాళీ బిందెలతో మహిళలు రోడ్లుపైకి వచ్చి, కాలినడకన కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి తాగునీళ్లు తెచ్చుకుంటున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం భూర్గుపేట గ్రామపంచాయతీ పరిధి అందుగులమెదిలో బోరు మోటర్ కాలిపోయి గత 26 రోజుల నుంచి తాగునీటి సరఫరా ఆగి గ్రామస్తులు ఇబ్బందిపడుతున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ములుగు జిల్లా కార్యదర్శి కాడపాక శ్యామ్ మాట్లాడుతూ.. తాగునీటి సమస్యను పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని, ఎంపీడీవో ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందన్నారు. వేసవికాలం ప్రారంభంలోనే తాగునీటి ఎద్దడిని నివారించడంలో అధికారులు విఫలమైయ్యారని, మహిళలు కిలోమీటర్ల దూరంలో వ్యవసాయ బావుల వద్దకు కాలినడకన వెళ్లి తాగునీళ్లు తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెరుమల్ల శైలజ, ఖమ్మం రమ, మీనుగు కవిత, సంకటి రమ, కోట సారక్క, వెంకటస్వామి, గంట రాకేశ్, కోట కొమ్మాలు, సాదు దేవేందర్, చింతల రాజు, రాజుకుమార్ తదితరులు పాల్గొన్నారు.