సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ట్రై కార్పొరేషన్ల (జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి) పరిధిలో సొంత గూడు నిర్మించుకోవాలనుకునే సామాన్యుడి ఆశలకు అధికారుల నిర్లక్ష్యం సంకెళ్లు వేస్తున్నది. నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రభుత్వం చేపట్టిన వార్డుల పునర్విభజన, జోన్ల మార్పులు టౌన్ ప్లానింగ్ విభాగాన్ని పాతాళానికి తొకేశాయి. అస్తవ్యస్తంగా మారిన యంత్రాంగం, సిబ్బంది కొరత, సమన్వయ లోపం వెరసి దరఖాస్తుదారులను నరకయాతనకు గురి చేస్తున్నాయి. అసిస్టెంట్ సిటీ ప్లానర్ నుంచి జోనల్ కమిషనర్ వరకు ఫైళ్లు తిరుగుతున్నాయే తప్ప.. అనుమతులు మాత్రం లభించడం లేదు.
ఈ క్రమంలోనే గడిచిన 15 రోజులుగా కూకట్పల్లి , ఉప్పల్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్లకు అధికారుల మధ్య సఖ్యత లేమితో అనుమతుల జారీపై తీవ్ర ప్రభావం పడింది. కూకట్పల్లి నుంచి కుత్బుల్లాపూర్ జోన్కు బదిలీ అయిన సుమారు 50 కీలక ఫైళ్లు ఇప్పటికీ ‘అడ్రస్’ లేవని బాధితులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఏసీపీ నుంచి సీపీ స్థాయి వరకు జరిగిన బదిలీల్లో చాలా మందికి డిజిటల్ కీ అందకపోవడం, మరోవైపు ఒక్కోక్కరికీ అదనపు బాధ్యతలతో అధికారులు సతమతమవుతుండడం గమనార్హం. వెరసి ప్రతి జోన్లో వందల సంఖ్యలో నిర్మాణ రంగ అనుమతుల దరఖాస్తులు నిలిచిపోయాయి. దీంతో సొంతింటి నిర్మాణ కలతో పాటు ప్రస్తుత శుభ ఘడియల వేళ.. ఓసీలు రాక బిల్డర్లు సైతం తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో విభజన తెచ్చిన తంటాలపై ఆదాయానికి గండి.. ఆస్తి పన్ను, భవన నిర్మాణ అనుమతుల ద్వారా జీహెచ్ఎంసీకి ఏటా సుమారు రూ.1,400 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఇంతటి కీలక ఆదాయ వనరును పట్టించుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అన్ని పత్రాలు సమర్పించినా, ఏదో ఒక కొర్రీ పెడుతూ ‘డాక్యుమెంట్ కాల్ ఫర్’ పేరిట ఫైళ్లను వెనకి పంపుతున్నారు. అవగాహన లోపమో లేక కావాలనే చేస్తున్న జాప్యమో తెలియక దరఖాస్తుదారులు తలలు పట్టుకుంటున్నారు.
వాస్తవంగా సిటీజన్ చార్టర్ ప్రకారం భవన నిర్మాణ అనుమతులు 21 పని రోజుల్లో మంజూరు చేయాలి. పత్రాలు అసంపూర్ణంగా ఉంటే అదే గడువులో తిరసరించాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల దరఖాస్తుదారులు అయోమయంలో పడుతున్నారు. కొన్ని జోన్లలో పూర్తి పత్రాలు సమర్పించినా.. తిరిగి పలు కారణాలను చూపుతూ ఫైళ్లను తిప్పి పంపుతున్నట్లు దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. భవన నిర్మాణ అనుమతుల మంజూరులో వేగం తీసుకురావాలంటే సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముందని అర్జీదారులు కోరుతున్నారు.