Salt | ఉప్పు మన రోజువారీ ఆహారంలో విడదీయరాని భాగం. వంటకానికి సరైన రుచిని తీసుకురావడంలో ఉప్పు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఉప్పును అధికంగా తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సాధారణ ఉప్పులో ఉండే సోడియం శరీరానికి అవసరమైనప్పటికీ, మోతాదుకు మించి తీసుకుంటే రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అందుకే రోజుకు ఎంత ఉప్పు తీసుకోవాలి? అది శరీరంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? అధికంగా తీసుకుంటే కలిగే నష్టాలేంటో తెలుసుకోవడం అవసరం. ఉప్పులోని సోడియం శరీరంలో అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. రక్తంలో కరిగి రక్తపోటును సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే శరీరంలో నీటి సమతుల్యతను కాపాడటంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. సోడియం ఒక ముఖ్యమైన ఎలక్ట్రోలైట్‌గా పనిచేసి కణాల పనితీరు, శరీరంలోని ద్రవాల సమతుల్యత, నరాలు, కండరాలు సక్రమంగా పనిచేయడానికి అవసరమవుతుంది.
అయితే సోడియంను అవసరానికి మించి తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల మెదడు మందగించినట్లు అనిపించడం, డీహైడ్రేషన్, శరీరంలో నీరు అవడం, కిడ్నీ రాళ్లు, జీర్ణాశయంలో పుండ్లు, రక్తపోటు, పొట్ట ఉబ్బరం, రక్తనాళాలు దెబ్బతినడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పోషకాహార నిపుణుల సూచనల ప్రకారం రోజుకు సుమారు 2400 మిల్లీగ్రాముల సోడియం తీసుకోవడం సరిపోతుంది. సాధారణంగా రోజుకు ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదని సూచిస్తున్నారు. శరీరంలో సోడియం లోపం ఉంటే వైద్యుల సలహా మేరకు అదనంగా తీసుకోవాల్సి ఉంటుంది. సోడియం తక్కువగా ఉంటే కండరాల నొప్పులు లేదా తిమ్మిర్లు, వాంతులు, తల తిరగడం, వికారం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది.
శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శరీరంలో సోడియం తక్కువగా ఉన్నప్పుడు మూత్రపిండాలు దానిని నిల్వ ఉంచుతాయి. సోడియం ఎక్కువగా ఉన్నప్పుడు అదనపు పరిమాణాన్ని మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. ఈ సహజ ప్రక్రియ వల్ల శరీరంలో సోడియం స్థాయిలు సాధారణంగా నియంత్రణలో ఉంటాయి. అయితే రక్తపోటు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు ఉప్పు వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రోజువారీ ఆహారంలో ఉప్పు పరిమితిని పాటించడం ద్వారా గుండె, మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.