Disha Salian : సెలబ్రిటీ మేనేజర్ దిశా సలియన్ మృతి కేసులో సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్లో ఆదిత్య థాక్రే సహా పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఈ అంశంపై రెండు రోజుల క్రితం దిశ తండ్రి సతీష్ సలియన్ సీబీఐ ఎదుట తన వాంగ్మూలం రికార్డు చేశారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడారు. సీబీఐకి కొన్ని కీలక విషయాలు చెప్పాను.
మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే తనయుడు ఆదిత్య థాక్రే, సూరజ్ పంచోలి, డినో మోరియా, రియా చక్రవర్తితోపాటు కొందరు బాడీగార్డ్స్ పేర్లు చెప్పాను. నేను చెప్పిన విషయాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీబీఐ అధికారులు చెప్పారు. కొద్ది రోజుల్లో చర్యలు ప్రారంభిస్తామన్నారు. నిజం ఓడిపోకూడదు. దేవుడు సత్యం వైపు నిలబడతాడు అంటూ దిశ తండ్రి సతీష్ చెప్పారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మేనేజర్ అయిన దిశ 2020 జూన్ 8న అనుమానాసన్పద రీతిలో మరణించారు.
ఆ తర్వాత వారం రోజులకు.. అంటే, జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వీరిద్దరి మృతికి ఉన్న సంబంధంపై అనేక అనుమానాలు తలెత్తాయి. తమ కూతురు దిశ మృతిపై ఆమె తల్లిదండ్రులు మాల్వాని పోలీసుల్ని గతంలో ఆశ్రయించారు. అయితే, ఆమెది ఆత్మహత్య అని, ఇందులో ఎలాంటి లోపం లేదని, అనుమానించడానికి ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు చెప్పారు. దీంతో దిశ తల్లిదండ్రులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
ఆమె మరణం వెనుక ప్రముఖ వ్యక్తుల ప్రమేయం ఉందని, అందువల్లే కేసులో సరిగ్గా విచారణ జరగడం లేదని కోర్టుకు వివరించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణ ప్రారంభించిన సీబీఐ తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.