Masood Azhar : జైషే మొహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ విషయంలో పాక్ ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. కొన్నేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న మసూద్ అజార్‌ను పట్టించిన వారికి 70 లక్షల పాక్ రూపాయలు బహుమతి అందిస్తామని ప్రకటించింది. ఇంతకముందు ఈ బహుమతి విలువ 20 లక్షల పాక్ కరెన్సీగా ఉండేది. ఇప్పుడు 50 లక్షల రూపాయలు అదనంగా పెంచింది. అయితే, దీనికి కారణం ఉంది. ఇదేమీ.. తీవ్రవాదుల విషయంలో పాకిస్తాన్ కఠినంగా వ్యవహరిస్తుందనే సంకేతం కాదు.
ఎఫ్ఏటీఎఫ్ (ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్) విధించే గ్రే లిస్ట్ నుంచి తప్పించుకోవడానికే. ఇండియాలో ముంబై దాడులు సహా అనేక దాడులకు మసూద్ అజార్ కీలక సూత్రధారి. ఇలాంటి అనేకమంది ఉగ్రవాదులకు పాక్ కేంద్రంగా ఉంది. వారికి ఆశ్రయమిస్తోంది. ఇలా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు ఎఫ్ఏటీఎఫ్ ఎటువంటి ఆర్థిక సాయం అందించదు. యూరప్ దేశాలు అప్పులు ఇవ్వాలి అంటే ఆ దేశాలు ఉగ్రవాద కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. తీవ్రవాదులకు వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టాలి. కానీ, పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. దీంతో ఈ దేశాన్ని ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులో పెట్టే ఛాన్స్ ఉంది.
అదే జరిగితే పాకిస్తాన్‌కు అంతర్జాతీయంగా అనేక దేశాలు అప్పులు ఇవ్వడానికి నిరాకరిస్తాయి. వచ్చే అక్టోబర్‌లో ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ జరగనుంది. ఈ సమావేశాల్లోనే పాకిస్తాన్ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తమ దేశాన్ని గ్రే లిస్టులో చేర్చకూడదు అనుకుంటే పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పని చేస్తున్నట్లు ప్రపంచాన్ని నమ్మించాలి. అందుకే.. ఉన్నట్లుండి ఇప్పుడు మసూద్ అజార్‌ను పట్టించిన వారికి అందించే బహుమతిని పెంచింది. తాము ఉగ్రవాదాన్ని నిర్మూలించే చర్యలు చేపడుతున్నట్లు నమ్మించడానికి ఇదో మంచి ఎత్తుగడ.
దీన్ని చూపించి, తమ దేశాన్ని గ్రే లిస్టులో పెట్టకుండా పాక్ అడ్డుకోవాలనుకుంటుంది. దీనివల్ల వివిధ దేశాలు ఆర్థిక సాయం అందిస్తాయి. అయితే.. మసూద్ అజార్‌ను పాకిస్తాన్ ప్రభుత్వమే కాపాడుతోందనే ప్రచారం ఉంది. అతడు ఆఫ్గనిస్తాన్‌లో ఉన్నాడని పాక్ చెబుతుంటే.. తమ దేశంలో లేడని ఆప్గన్ చెబుతోంది.