త్వరలోనే సైదాబాద్ స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించి, హైదరాబాద్ నగరవాసులకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంత్రి అజారుద్దీన్‌తో కలిసి బుధవారం ఉదయం సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి, ముసారాంబాగ్ బ్రిడ్జి పనులను పొన్నం ప్రభాకర్ పరిశీలిచారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు సుమారు రూ.680 కోట్ల వ్యయంతో పూర్తయ్యాయని తెలిపారు. చంచల్‌గూడ జైలు నుంచి ఒవైసీ ఆసుపత్రి వరకు, మరోవైపు చంపాపేటకు అనుసంధానంగా ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ బ్రిడ్జిని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ బ్రిడ్జి ప్రారంభంతో సంతోష్ నగర్, చంచల్‌గూడ, సైదాబాద్ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని అన్నారు.
సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి తో పాటు మూసారాంబాగ్ బ్రిడ్జి తర్వలోనే అందుబాటులోకి తీసుకొస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. మరోవైపు కేబీఆర్ పార్క్ వద్ద బ్రిడ్జి పనులు వేగంగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ట్రాఫిక్ , ప్రజా సేవల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.