చండ్రుగొండ, సెప్టెంబర్ 22: గ్రామాల్లో నెలకొన్న వివిధ రకాల సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణను ప్రజలు నిలదీసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. సోమవారం చండ్రుగొండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో జరిగిన భవిత్ బిల్డింగ్ శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దీంతో స్థానిక ప్రజలు ఎమ్మెల్యే జారేపై ప్రశ్నల వర్షం కురిపించారు.
వెంకటియాతండా పంచాయతీలో సీసీ రోడ్డు లేక మోకాళ్లలోతు నీరు నిలస్తున్నా పట్టించుకోవడంలేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు నిలుపుకోవడంలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించడంతో పోలీసులు, అధికార పార్టీ నాయకులు వారిని పక్కకు నెట్టేశారు. చండ్రుగొండలో డ్రైనేజీ నిర్మాణం అసంపూర్తిగా ఉందని, వర్షం వస్తే ఇండ్లలోకి మురుగునీరు వస్తుందని ఇషాక్ అనే యువకుడు ఎమ్మెల్యేను ప్రశ్నించటంతో అధికార పార్టీ నాయకులు వెంటనే ఆ యువకున్ని బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు.
చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు తాగునీరు లేదని, రెండేండ్లుగా అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఎమ్మెల్యేను నిలదీయడంతో త్వరలో పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. హైస్కూల్ బజారులో డ్రైనేజీ లేక దుర్గంధం వెదజల్లుతుందన్నారు. డ్రైనేజిని నిర్మించాలని కాలనీవాసులు కోరారు. ఎమ్మెల్యే పర్యటనలో ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతుండటంతో అధికార పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంధ్యారాణి, ఎంఈవో సత్యనారాయణ, ఏఈ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.