మెదక్, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ): పాలన చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధిం పు రాజకీయాలకు పాల్పడుతున్నదని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి మండిపడ్డారు. మెదక్ పోలీసులు కాంగ్రెస్ నేతల చేతుల్లో కీలు బొమ్మలుగా మారారని, కాంగ్రెస్ నేతలు చెప్పిందే ఆలస్యం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్‌ను అక్రమ అరెస్టును నిరసిస్తూ శనివారం మెదక్‌లోని జిల్లా కోర్టు వద్ద మీడియాతో ఆమె మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. కేసులకు భయపడే ప్రసక్తి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధ్దిచెప్పడం ఖాయమని పద్మాదేవేందర్‌రెడ్డి అన్నా రు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసు లు నమోదు చేసి అరెస్టు చేశారన్నారు. మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రజల మద్దతుతో అధిక కౌన్సిలర్ స్థానాలు గెలిచిందన్నారు. కాంగ్రెస్ రాజకీయంగా ఎదుర్కోలేక పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే అక్రమ కేసలు పెట్టి తెల్లవారుజామున ఇంటికి వెళ్లే అరెస్టు చేశారని పద్మాదేవేందర్‌రెడ్డి ఆరోపించారు.
మల్లికార్జున్ గౌడ్ తల్లి, భార్య పిల్లలను పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారన్నారు. అక్రమంగా అరెస్టు చేసి మెదక్ రూరల్ పోలీసు స్టేషన్‌కు తరలించడంపై ఆమె మండిపడ్డారు. హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి, మెదక్‌లో ఎమ్మెల్యే మైనంపల్లి కక్ష సాధిం పు చర్యలకు పాల్పడుతున్నారని, పోలీసులతో అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టం విడ్డూరంగా ఉండన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో అధికార పార్టీనేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు.
సైలెంట్ పీరియడ్‌లో కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసి డబ్బులు పంపిణీ చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని పద్మాదేవేందర్‌రెడ్డి ఆరోపించారు. పోలీసులు కాం గ్రెస్ పార్టీ నాయకుల కంటే ఎక్కువగా పనిచేస్తున్నారని, పోలీసులు కాంగ్రెస్ కండువాలు కప్పుకోవాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. పోలీసు స్టేషన్లు కాం గ్రెస్ కార్యాలయాలుగా మారాయని పద్మాదేవేందర్‌రెడ్డి విమర్శించారు.

పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదు
– దేవేందర్‌రెడ్డి, న్యాయవాది, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు
మెదక్ పోలీసులు అతి చేస్తున్నారని, భవిష్యతులో వారు మూల్యం చెల్లించుకోక తప్పదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, న్యాయవాది దేవేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ పట్టణ సీఐ తెల్లవారుజామున మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్‌పై దాడి చేసి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు స్టే ఉన్న వ్యక్తులను అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నా మెదక్ పట్టణ సీఐ అత్యుత్సాహంతో అరెస్టు చేశారని మండిపడ్డారు. అక్రమ అరెస్టుపై హెచ్ఆర్సీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులుగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని సీనియర్ న్యాయవాదులు మాదవరెడ్డి, జీవన్‌రావు, మాయా వెంకటేశం, ప్రశాంత్, చిరంజీవి, సుధాకర్, ఇప్ప సాయి కుమార్, మల్లూరి రాకేశ్, మల్లికార్జున్ గౌడ్ తరపున కోర్టులో వాదనలు వినిపించారు. కోర్టు మల్లికార్జున్‌గౌడ్‌కు బెయిల్ మంజూరు చేసింది.