హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): పంజాగుట్ట పోలీస్స్టేషన్లో తనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని, టీవీ చానల్ ఏర్పాటు చేయిస్తానని నమ్మబలికి లైంగికదాడికి పాల్పడ్డారని, రూ.5 లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వలేదని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసు పూర్తిగా తప్పుడు ఆరోపణలపై ఆధారపడిందని, రాజకీయంగా తనను దెబ్బతీయడమే లక్ష్యంగా ఫిర్యాదు చేశారని కాంతారావు తన పిటిషన్లో పేరొన్నారు. నాలుగేండ్ల క్రితం జరిగినట్టు చెప్తున్న ఘటనపై ఇప్పుడు కేసు నమోదు చేయడం చట్టబద్ధం కాదని, అందువల్ల ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరారు.