మెదక్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): పోలీసులు బెదిరించి, అసభ్యకరంగా ప్రవర్తించి తన భర్త మెదక్ మాజీ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్‌ను అరెస్టు చేశారని అతని భార్య గాయత్రి, తల్లి లక్ష్మి, కుటుంబీకులు ఆరోపించారు. మెదక్ పట్టణ సీఐపై మల్లికార్జున్‌గౌడ్ కుటుంబీకులు శనివారం మెదక్ జ్యుడీషయల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మెదక్ పట్టణం నవాబుపేటలోని తమ నివాసానికి శనివారం ఉదయాన్నే మెదక్ పట్టణ సీఐ మహేశ్ 20 మంది పోలీసులతో వచ్చి తన భర్తను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని ఆరోపించారు.
ఈ సందర్భంగా కుటుంబీకులను భయభ్రాంతులకు గురిచేశారని ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్షతోనే మెదక్ పట్టణ పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసి తన భర్తను అరెస్టు చేశారని, దీనిపై హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేశామని గాయత్రి తెలిపారు. హైకోర్టు స్టే ఉన్నా పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి తెల్లవారుజామున ఇంట్లోకి చొచ్చుకు వచ్చారని, మహిళా పోలీసు సిబ్బంది లేకుండా తనను, కూతురు దీక్షిత, అత్తను నెట్టివేసి, ఇంట్లోని ప్రతి రూమ్‌ను సోదా చేసి, మైనర్ అయిన తన కూతురు దీక్షితను చూడకుండా నెట్టేసి అరెస్టు చేశారని గాయత్రి ఆరోపించారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారని పట్టణ సీఐ మహేశ్‌ను ప్రశ్నిస్తే, ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, బెదిరించారని ఆరోపించారు. తమను ఇబ్బందులకు గురిచేసిన సీఐపై చర్యలు తీసుకోవాలని గాయత్రి కోరారు.