ఇల్లెందు, సెప్టెంబర్ 22: అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో విధులు నిర్వహిస్తున్న డెయిలీ వైజ్, కాంటింజెంట్ వర్కర్లు చేపట్టిన నిరవధిక సమ్మె ఇల్లెందు పట్టణంలో సోమవారం నాటికి 11వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపు కార్యాలయం వద్ద సీఐటీయూ నాయకులతో కలిసి వర్కర్లు నిరసనకు దిగడంతో అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో వారు అక్కడి నుంచి ప్రదర్శనగా బయలుదేరి తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకొని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకుడు అబ్దుల్ నబి మాట్లాడుతూ ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న డెయిలీ వైజ్, కాంటింజెంట్ వర్కర్ల వేతనాలు తగ్గిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో జారీ చేయడం సరికాదన్నారు. వెంటనే ఆ జీవోను రద్దు చేయాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంగళవారం నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిరవధిక సమ్మె చేపడుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డెయిలీ వైజ్, కాంటింజెంట్ వర్కర్లు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.