Keerthy Suresh | సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోలతో సినిమాలు చేసిన ఆమె ఇటీవల హిందీ చిత్రాల్లో కూడా అవకాశాలు అందుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె నటించిన మరో హిందీ సినిమా ‘రఫ్తార్’ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావుకు జంటగా కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం ‘రఫ్తార్’. వెండితెరపై ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రమిది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే బాలీవుడ్లో మంచి నటుడిగా గుర్తింపు పొందిన రాజ్‌కుమార్ రావుతో కీర్తి జోడీ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. ‘రఫ్తార్’ సినిమాను జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. యాక్షన్, ఎమోషన్ మిళితంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. అమెజాన్ MGM స్టూడియోస్, ఎ క్యాంపె ఫిల్మ్స్ సంస్థలపై ఈ సినిమా రూపొందుతోంది. దర్శకుడు ఆదిత్య నింబల్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ రావు భార్య పత్రలేఖ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి హీరో, హీరోయిన్ ఫస్ట్ లుక్‌లు విడుదల కాకపోయినా పోస్టర్‌ను బట్టి ఇది డెప్త్ ఉన్న కథగా ఉండబోతుందని తెలుస్తోంది. సినిమాలో రాజ్‌కుమార్ రావు ఓ యువకుడిగా కనిపించగా, అతనికి సమానంగా పోటీ ఇచ్చే బలమైన పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుందని సమాచారం.
ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావు, కీర్తి సురేష్‌తో పాటు అనురాగ్ ఠాకూర్, రోహన్ వర్మ, తన్యా మానిక్తలా, రజత్ కపూర్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కథకు అనుగుణంగా విభిన్నమైన పాత్రలు ఈ సినిమాలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాజ్‌కుమార్ రావు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఆయన నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న ‘టోస్టర్’ అనే సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన సరసన సన్యా మల్హోత్రా హీరోయిన్గా నటిస్తోంది. ఫరా ఖాన్, అభిషేక్ బెనర్జీ, అర్చనా పూరన్ సింగ్ వంటి నటీనటులు కూడా ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొత్తానికి ‘రఫ్తార్’ సినిమా ద్వారా కీర్తి సురేష్ మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఆమెకు హిందీ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తీసుకువస్తుందా లేదా అనేది చూడాలి.