హైదరాబాద్, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ): వరి పొట్టకొచ్చింది.. మక్కజొన్న కంకి పెడుతున్నది.. పత్తి పూతకొస్తున్నది.. ఈ దశలో ఆయా పంటలకు యూరియా తప్పనిసరి. ఇప్పుడు యూరియా వేస్తేనే పంటల్లో ఎదుగుదల ఉండి, దిగుబడి పెరుగుతుంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరతతో అదునుకు వేయాల్సిన సమయంలో రైతులు ఎరువు వేయలేకపోతున్నారు. దీంతో ఎదుగుదల లోపించి, ఆయా పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం పడనున్నది. అన్నదాతలు తీవ్రంగా నష్టాలు చవిచూడనున్నారు. ఈసారి పంటల దిగుబడులు భారీగా తగ్గుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలే స్పష్టం చేస్తున్నారు. కనిష్ఠంగా 20% గరిష్ఠంగా 40% వరకు పంటల దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నదని తేల్చి చెప్తున్నారు. సాధారణంగా వంద క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చే రైతుకు యూరియా కొరత కారణంగా 60 నుంచి 80 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉన్నది.
కంటికి రెప్పోలే కాపాడుకునే పంట చేలు యూరియా కొరతతో తమ కండ్ల ముందే పాడైపోతుంటే అన్నదాతలు తల్లడిల్లుతున్నారు. ముఖ్యంగా వరి, మక్క, పత్తి పంటలు ప్రస్తుతం ఎదిగే దశలో ఉన్నాయి. ఈ దశలో యూరియా వేస్తేనే పంటలకు మేలు జరుగుతుంది. యూరియా దొరక్కపోవడంతో వరి, మక్క, పత్తి పంట చేలు ఎర్రబారుతున్నాయి. వరి పొట్టదశలో ఉండటంతో యూరియా అందక వరి కంకి ఆశించిన స్థాయిలో రావడం లేదని రైతులు గుబులు చెందుతున్నారు. మక్క సైతం పాల కంకి దశలో ఉన్నది. ఈ దశలో యూరియా అందక కండి బలంగా ఉండదని చెప్తున్నారు. పత్తి ఇప్పుడు పూత దశలో ఉన్నది. ఈ దశలో యూరియా వేస్తే పూత ఎక్కువొచ్చి, పత్తి దిగుబడి పెరుగుతుంది. కానీ ఇప్పుడు యూరియా కొరతతో పత్తిచేలు వాడుతున్నాయి.ఈ మేరకు ఆయా పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఒక్క బస్తా యూరియా దొరికినా చాలనే విధంగా యూరియా కొరతపై ఏకంగా పోరాటమే చేస్తున్నారు. రాత్రి-పగలు, ఎండ-వాన, తిండి-తిప్పలు మాని యూరియా కోసం రోజంతా వేచి ఉంటున్నారు. అయినా యూరియా కొరత వారిని వేధిస్తూనే ఉన్నది.
పశువులకు మేతగా పంటచేలు
వరి, మక్క, పత్తి పంట చేలకు యూరియా అందక కొన్ని వాడుముఖం పట్టాయి. మరికొన్ని ఎదుగుదల లోపించి ఎర్రబారుతున్నాయి. పంట పొలాల్లో అధికంగా కలుపు పెరుగుతున్నది. వీటిని ఇలాగే ఉంచితే ప్రయోజనం కన్నా రైతులకు నష్టమే ఎక్కువయ్యే అవకాశం ఉన్నది. దీంతో ఎర్రబారిన, ఎదగని పంట చేలను రైతులు తొలగిస్తున్నారు. యూరియా దొరక్క మక్కజొన్న చేను ఎదగడం లేదని, కలుపు పెరిగిందని సిద్దిపేట జిల్లా మీర్జాపూర్‌కు చెందిన రైతు శ్రీకాంత్ తన పంటచేనును పశువులకు మేతగా వదిలేశారు. వరంగల్ జిల్లా గొల్లగూడెం తండా రైతు శ్రీనుది మరో గోస. ఐదెకరాల్లో మక్క సాగుచేసిన ఆ రైతుకు కేవలం ఎకరానికే యూరియా దొరికింది. దీంతో మిగిలిన నాలుగు ఎకరాల మక్కజొన్న చేను అక్కరకే రాకుండా పోయింది. దౌల్తాబాద్ రైతు ముత్యాలు యూరియా దొరక్కపోవడంతో తన మక్కజొన్న పంటను ట్రాక్టర్‌తో దున్నేశారు. ఈ విధంగా యూరియా కొరత కారణంగా రైతులు తమ పంటలను చెడగొడుతున్నారు.