తిరుమలాయపాలెం/ వైరా టౌన్, సెప్టెంబర్ 22: నాలుగు నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మిషన్ భగీరథ కార్మికులు సోమవారం నీటి సరఫరాను నిలిపివేసి.. విధులు బహిష్కరించి జేఏసీ ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం, వైరా మండల కేంద్రాల్లో సమ్మె పట్టారు. తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం జల్లేపల్లి, గోల్తండా, బచ్చోడు, జూపెడ, కాకరవాయి వద్ద గేట్వాల్వ్ను బంద్ చేసి తాగునీటి సరఫరా నిలిపివేశారు.
దీంతో మండలస్థాయి అధికారులు, వీఆర్వోలు, పోలీసులు మిషన్ భగీరథ కార్మికులతో మాట్లాడినప్పటికీ సమ్మెను ఆపేది లేదంటూ తేల్చి చెప్పారు. ఏజెన్సీలకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో తమకు వేతనాలు ఇవ్వడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పెండింగ్ వేతనాల విషయాన్ని ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు.
జిల్లాలోని ముగ్గురు మంత్రులు జోక్యం చేసుకొని తమకు వేతనాలు వచ్చే విధంగా చూడాలని జేఏసీ నాయకులు భరత్, ఉపేందర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొంతు రాంబాబు, చింతనిప్పు చలపతి, పురుషోత్తం, అమరనేని కృష్ణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వరరావు, నాయకులు ఏదునూరు, పాపకంటి రాంబాబు, అన్నం వెంకయ్య, వేల్పుల అనంతరావు, అనుబోతు బాలకృష్ణ, మద్దెల రవి, బత్తుల కిశోర్, యాకోవలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.