సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ పరిధిలోని వేర్వేరు చోట్ల గంజాయి, ఓజీ కుష్, బంగ్ వంటి మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఏడుగురిని ఆబ్కారీ శాఖకు చెందిన ఎస్టీఎఫ్ పోలీసు బృందాలు అరెస్టు చేశాయి. నిందితుల వద్ద నుంచి 5.4గ్రాముల విదేశీ గంజాయి(ఓజీ కుష్), 1.060కిలోల బంగ్, 360గ్రాముల మత్తు చాక్లెట్లు, 233గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివవరాల్లోకి వెళితే.. పటాన్ చెరు, ఇస్నాపూర్ ప్రాంతంలో మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఎస్టీఎఫ్ టీమ్-డీ పోలీసులు నిఘా పెట్టారు. గురువారం ఉదయం చల్ల సాకేత్ రెడ్డి, ఆదిత్య కుమార్ రాయ్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడకు వచ్చి ఓజీ కుష్ అనే విదేశీ గంజాయిని విక్రయిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును పటాన్చెరు ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
హోలీ పండుగ..బంగ్ గోళీలు
హోలీ పండుగ సందర్భంగా కొంత మంది గంజాయితో తయారు చేసిన బంగ్ గోళీలు, మత్తు చాక్లెట్లను తీసుకుని హల్చల్ చేయడం ధూల్‌పేట, బేగంబజార్, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో ఆనవాయితీ. అయితే నిషేధిత మత్తు పదార్థాలను చాక్లెట్లు, గోళీల రూపంలో విక్రయిస్తున్నట్లు విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ధూల్‌పేట, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో బుధవారం ఎస్టీఎఫ్ పోలీసులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మత్తు చాక్లెట్లు, బంగ్ వంటి మత్తు పదార్థాలు విక్రయిస్తున్న దినేశ్ చంద్ర శర్మ, జీవన్ లాల్ యాదవ్, సోహెల్, ఆకాష్ శర్మలను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 1.060కిలోల బంగ్, 360 గ్రాముల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును ధూల్‌పేట ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
నారాయణగూడలో….
నారాయణగూడ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్టీఎఫ్ టీమ్-బీ పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఓమ్ సింగ్ అనే వ్యక్తి వద్ద 233గ్రాముల గంజాయి లభించింది. నిందితుడిని అరెస్టు చేసి, తదుపరి విచారణ నిమిత్తం కేసును నారాయణగూడ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.