మహారాష్ట్ర పూణెలో అందమైన కోటలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి శనివార్వాడ. మరాఠా యోధుడు బాజీరావు తనకోసం ఈ కోటను కట్టించుకున్నాడు. బాజీరావు పేరు వినగానే మీ మనసు ఎక్కడో తెరపై తెరలుతెరలుగా పోతోంది కదూ! ఆ ‘బాజీరావు మస్తానీ’ యోధుడే ఈ కోటకు వీరుడు. కోట ముఖద్వారం మొదలు అణువణువూ అద్భుతంగా ఉంటుంది. విశాలమైన ప్రసాదాలు, ప్రాంగణాలు, గదులు చక్రవర్తుల రాజ భవనాన్ని మరిపిస్తాయి. ఇటుకలతో నిర్మించినా నేటికీ చెక్కు చెదరని నిర్మాణం ఆనాటి పనితీరుకు అద్దంపడుతుంది. చుట్టూ ఉన్న అందమైన తోట మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది. పూణె పర్యటనకు వచ్చేవారంతా శనివార్వాడ కోటను సందర్శించకుండా తిరిగి వెళ్లరు. రోజూ వందల మంది కోటలోకి ప్రవేశిస్తారు. అదే పౌర్ణమినాటి రాత్రి అయితే కోట దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా సాహసించరు. ఔత్సాహిక పర్యాటకులు మాత్రం కోట పరిసరాల్లో తచ్చాడుతుంటారు.
కాపాడు మామా
బాజీరావు మరణం తర్వాత అతని కుమారుడు బాలాజీ రావు పీష్వాగా నియమితుడయ్యాడు. అతని మరణం తర్వాత బాజీరావు మూడో కొడుకు 16 ఏండ్ల నారాయణరావు పీష్వా అయ్యాడు. అతనికి మేనమామ రఘునాథరావు సంరక్షకుడిగా ఉండేవాడు. కొన్నాళ్లకు రఘునాథరావు అల్లుడిని అంతమొందించాలనుకుంటాడు. విషయం తెలిసి మేనమామను చెరశాలలో బంధించాడట నారాయణరావు పీష్వా. రఘునాథరావు స్నేహితుడైన గిరిజన నాయకుడు ఒక పౌర్ణమి రాత్రి కోటలోకి ప్రవేశించి నారాయణరావుపై దాడికి దిగాడట. ‘మామా నన్ను కాపాడు.. చంపేస్తున్నాడు’ అని మొరపెట్టుకున్నా దారుణంగా చంపేశాడట. ఆనాటి నుంచి ప్రతి పౌర్ణమి రోజు ‘మామా నన్ను కాపాడు..’ అన్న మాటలు కోటలో ప్రతిధ్వనిస్తుంటాయని చెబుతారు. నేటికీ ఈ మాటలు వినిపిస్తాయని అనేవాళ్లు ఉంటారు. పూణె రైల్వే స్టేషన్ నుంచి ట్యాక్సీలు, ఆటోల్లో శనివార్వాడ కోటకు చేరుకోవచ్చు.