హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రెండు స్థానాలకు గాను గురువారం చివరి రోజున మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా సాయి నామినేషన్ వేశారు. నిబంధనల ప్రకారం సరైన సంఖ్యలో ఎమ్మెల్యేల మద్దతు లేకుండానే సాయి నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో స్క్రూటినీ దశలోనే ఆయన అభ్యర్థిత్వం తిరస్కరణకు గరయ్యే అవకాశం ఉన్నదని ఎన్నికల అధికారులు తెలిపారు.
ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా హాజరయ్యారు. ఎన్నికల అధికారి ఉపేందర్‌రెడ్డికి సింఘ్వీ నాలుగుసెట్లు, వేం నరేందర్‌రెడ్డి మూడు సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు. రాజస్థాన్‌కు చెందిన సింఘ్వీ తెలంగాణ నుంచి సిట్టింగ్ మెంబర్‌గా కొనసాగుతున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని కొన్ని రోజుల కిందటే ఖరారు చేశారు. సుదీర్ఘ తర్జనభర్జనల అనంతరం వేం నరేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని బుధవారం రాత్రి ఖరారు చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, సీతక్కతోపాటు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అంతకుముందు అసెంబ్లీ హాల్లో అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సైతం కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులను అభినందించారు. నామినేషన్ ప్రక్రియ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో మీడియాపై ఆంక్షలు విధించడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీకి వస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులను సీఎల్పీ హాల్ నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. టికెట్ దక్కని అధికారపార్టీకి చెందిన అసంతృప్త నేతలు నిరసన తెలుపనున్నారనే సమాచారం మేరకే మీడియా ప్రతినిధులను కట్టడి చేసినట్టు తెలుస్తున్నది.