బూర్గంపహాడ్, జూలై 24 : నీట్ పరీక్ష పత్రాల లీకేజీ విషయంలో ఢిల్లీలో జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యార్థులపై దాడులకు దిగి లాఠీచార్జి చేస్తూ కర్కశంగా ప్రవర్తిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో శుక్రవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ప్రధాన కూడలిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, మండల నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థులపై జరుగుతున్న అన్యాయాలకు, అణిచివేత, దాష్టీకానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. నీట్ పరీక్ష పత్రాల లీకేజీలో ప్రశ్నించిన విద్యార్థులపై లాఠీచార్జీకి దిగడం కేంద్రం పనితీరుకు చెంపపెట్టు లాంటిదన్నారు. కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ విద్యార్థులకు మద్దతుగా నిరసన ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మండల ప్రజా ప్రతినిధులు, మహిళా నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.