సర్వే ఫలితాలపై సెఫాలజిస్టు సైదులు వివరణ కోరగా, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నట్టు తన సర్వేలో తేలినట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మూడుశాతం ఎడ్జ్‌లో ఉన్నట్టు చెప్పానని వివరించారు. కానీ ఆయన 10 టీవీకి ఇచ్చిన నివేదిక గ్రాఫ్ చిత్రాలను ఆ చానల్ తన అధికారిక వెబ్సైట్లో పెట్టింది. ఆ నివేదికల ప్రకారం సైదులు చేసిన సర్వేలో బీఆర్స్ పార్టీకి స్పష్టమైన ఎడ్జ్ ఉన్నట్టు కనిపిస్తున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్22(నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. జూబ్లీహిల్స్‌లో గెలిచి పట్టు నిలుపుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి పట్టుదలగా ఉన్నారు. అయితే, ఎన్నిక ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్దే విజయమని పలు సర్వేలు చెప్తున్నాయి. సాక్షాత్తూ కాంగ్రెస్ చేయించిన సర్వేలోనూ ఇదే తేలింది. దీంతో అవాక్కవడం సీఎం వంతైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బస్తీలు, అర్బన్ ప్రాంత ప్రజలు మూకుమ్మడిగా గులాబీ జెండాకు జైకొట్టినట్టు ఆ సర్వేలో తేలినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు, కాంగ్రెస్ సెఫాలిజిస్టుగా గుర్తింపు పొందిన సైదులు నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ కంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ దాదాపు 3 శాతం ఓట్లతో ముందంజలో ఉందని తేలింది. ఈ సర్వే వివరాలతో 10 టీవీ ‘ప్రైమ్ టైమ్ డిబేట్’ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సైదులు.. రేవంత్‌రెడ్డి విజన్, 22 నెలల కాంగ్రెస్ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని శాస్త్రీయంగా వివరించి చెప్పారు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్దే
ధనిక వర్గాలు, నిరుపేదలతో సమ్మిళతమై ఉండే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ సర్వే నిర్వహించినట్టు ఆ కార్యక్రమంలో సైదులు తెలిపారు. మొత్తం 5,576 శాంపిళ్లు సేకరించి వాటిని శాస్త్రీయంగా విశ్లేషించారు. సర్వేలో పాల్గొన్న 32.6 శాతం మంది ఓటర్లు మళ్లీ కారే కావాలని, కేసీఆరే రావాలని తేల్చి చెప్పారు. 29.5 శాతం మంది మాత్రమే కాంగ్రెస్‌కు ఓటేస్తామని చెప్పారు. కార్పొరేటర్ సీఎన్‌రెడ్డి ప్రభావం ఉండటంతో ఒక్క రహమత్‌నగర్ మినహా షేక్‌పేట, ఎర్రగడ్డ, శ్రీనగర్‌కాలనీ, యూసుఫ్‌గూడ, సోమాజీగూడ, వెంగళరావునగర్, బోరబండ డివిజన్లోని అర్బన్, బస్తీ ప్రజలు కేసీఆర్‌కే మద్దతు తెలిపారు 1,823 మంది బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపగా, 1,646 మంది కాంగ్రెస్‌కు ఓటేస్తామని చెప్పారు. ఈ సర్వేలో ఎంఐఎం, బీజేపీ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. కాంగ్రెస్, ఎంఐఎం పొత్తు పెట్టుకుంటే ఫలితాలు మారుతాయా? అన్న యాంకర్ ప్రశ్నకు సైదులు వివరణ ఇస్తూ అది అంత సులభమేమీ కాదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముస్లింలు కూడా ఒక కారణమని కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు. రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నా ముస్లింల ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్‌కు పడవన్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేకు గడ్డు పరిస్థితులు
పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ తాను సర్వే చేశానని, అక్కడ కూడా వారికి గడ్డు పరిస్థితులు ఉన్నాయని సైదులు తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఒకటి, రెండు స్థానాలు మినహా గెలిచే అవకాశం లేదని చెప్పారు. వారికి కాంగ్రెస్ పార్టీ క్యాడర్, స్థానిక నేతల బలం లేదని వివరించారు. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తున్న స్టేషన్ఘనపూర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లు ఇద్దరు గెలిచే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు.
ఏఐసీసీకి మంత్రుల రిపోర్టు
అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు తాను చేసిన సర్వే ప్రకారం బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సి ఉందని, కేసీఆర్ 15-20 సిట్టింగ్ సీట్లు మార్చి ఉంటే బీఆర్ఎస్కు 62-64 సీట్లు వచ్చేవని, కానీ సిట్టింగులకే సీట్లు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చిందని సైదులు వివరించారు. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ ప్రజలు ఏ నాయకుడికైనా 10 ఏండ్లకు మించి అవకాశం ఇవ్వరని, అయినా కేసీఆర్‌కు మరో అవకాశం ఇవ్వాలని అనుకున్నట్టు ఆయన వివరించారు. 22 నెలల కాంగ్రెస్ పాలనపై మంత్రులు సానుకూలంగా ఉన్నప్పటికీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు నిరాశతో ఉన్నారని, పనులు కావడం లేదని చెప్పారని ఆయన వివరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడి వారి పనితీరు, అవినీతి, ఇతర అంశాలను బేరీజు వేసి నివేదిక రూపొందించనున్నట్టు చెప్పారు. దీనిని ఏఐసీసీలోని ఓ కీలక నేతకు మెయిల్ చేయనున్నట్టు చెప్పారు.
ఎవరీ సైదులు?
సైదులు నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి చెందిన సెఫాలజిస్టుగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో సైదులు అప్పడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డితో అటాచ్ అయినట్టు తెలుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇద్దరూ తరచూ కలుసుకొంటున్నారు. సీఎంకు అవసరమైన సర్వేలు ఆయనే చేసిపెడుతున్నట్టు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ఆయన సర్వేల మీదనే ఆధారపడి రేవంత్‌రెడ్డి నిర్ణయాలు తీసుకుంటారని 10 టీవీతో సైదులు చెప్పిన మాటలను బట్టి తెలుస్తున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, ఫిరాయింపుదార్ల నియోజకవర్గాల్లో పలు ప్రభుత్వ, ప్రైవేటు ఏజెన్సీలతో సర్వే చేయించిన రేవంత్‌రెడ్డికి మింగుడుపడని ఫలితాలు రావడంతో సైదులతో మరో సర్వే చేయించినట్టు సమాచారం. సర్వే ఫలితాలు బయటపడటంతో కాంగ్రెస్‌లో ఆందోళన మొదలైంది.