Kasi Majili Kathalu Episode 24 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కాశీ యువరాణి విశాలాక్షి భర్త అయిన మదునుణ్ని, మలయాళ దేశంలో బందీగా ఉండగా కలుసుకున్నాడు ఇంద్రద్యుమ్న మహారాజు. మలయాళ రాజు సింహకేతుడు వారిని రక్షించాడు. పురుషవేషంలో ఉన్న సింహకేతుడే విశాలాక్షి అని తెలిసింది. ఆమెకు కాశీ విశాలాక్షి అనుగ్రహం వల్ల ఒక అద్భుత ఫలం, పుష్పం లభించాయి.వాటిని చూసి మెచ్చుకున్న మలయాళ దేశపు రాజు.. పురుషవేషంలోని ఆమెకు తన కూతురిని, రాజ్యాన్ని కూడా ఇచ్చాడు.
వసంతలతికకు, మదనునికి వివాహం జరిగింది. ఆ తరువాత మదనుడు మల యాళదేశానికి రాజయ్యాడు. విశాలాక్షి తనకు లభించిన అద్భుతఫలాన్ని నాలుగు ముక్కలుగా కోసి.. ఇంద్రద్యుమ్నునికి, చిత్రసేనకు, మదనునికి, వసంతలతికకు ఇచ్చింది. అది తిన్నవారందరికీ ఆకలి దప్పికలు లేకుండా పోయాయి.
“పెదనాన్నా! కాశీరాజ్యాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని ఉంది. దానికి మీ సహాయం కావాలి” అని విశాలాక్షి అడిగింది.
అప్పుడు ఇంద్రద్యుమ్నుడు..
“అమ్మా! ప్రస్తుతం నేను రాలేను. నా కుమారుడైన విజయుడు మా జాడ తెలియక చింతిస్తూ ఉంటాడు. అతణ్ని కలుసుకోవాలని మా మనసులు ఆరాట పడుతున్నాయి. నువ్వు పుస్తకం ఆధారంగా గుహమార్గం నుంచి కోటలో ప్రవేశించి, శత్రువులను తేలికగా గెలువగలవు. నా ఆశీస్సులు నీకుంటాయి” అని పలికాడు.
ఆయన కోరికమేరకు మదనుడు తగిన సరుకులు, సరంజామాతో ఒక ఓడను సిద్ధం చేశాడు. నేర్పరులైన నావికులను నియమించాడు. వారెక్కిన ఓడ సముద్రంలో మూడు వారాలపాటు అతివేగంగా ప్రయాణించింది. అంతలో ఓడ సరంగుకు ఆకాశంలో గాలీవాన లక్షణాలు కనిపించడంతో ఓడకు లంగరు వేయించాడు.
ఆనాడు ప్రారంభమైన సముద్ర తుఫాను మూడు రోజులైనా శాంతించలేదు. దాపున భూమిలేదు. ఓడ తిరగబడితే రక్షించేవారెవరూ లేరు.
“ఎవరి ఇష్టదైవాన్ని వారు స్మరించుకోండి” అని సరంగు ప్రకటించాడు.
చిత్రసేన కన్నుల్లో నీరు నింపుకొని భర్తను కౌగిలించుకుంది. ఆమెను ఓదార్చుతూ..
“పిచ్చిదానా! శుభానికి సంతోషం, అశుభానికి విచారం ఎన్నడూ పొందకూడదు. బ్రహ్మరాతను సురాసురులైనా దాటలేరు. మానవుడెప్పుడూ సుఖదుఃఖాల మధ్య తిరుగాడుతూనే ఉంటాడు. సుఖదుఃఖాలనుంచే మనకీ శరీరం వచ్చింది. సుఖం అనంతరం దుఃఖం, దుఃఖం తరువాత సుఖం నియమితంగా వస్తూనే ఉంటాయి. మార్గంలో బాటసారులు, నదుల్లో కొయ్యదుంగలు, ఆకాశంలో మేఘాలు కలుసుకున్నట్లు లోకంలో మానవులం మనం కలిసి విడిపోతుంటాం. విడిపోయినా మళ్లీ కలుస్తుంటాం. మనకు ఈవిధమైన చావు రాసిపెట్టి ఉంటే తప్పించుకోలేం” అన్నాడు.
దంపతులిద్దరూ భగవంతుణ్ని ధ్యానిస్తూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నారు. చిత్రసేనను గట్టిగా పట్టుకుని ఉన్నాడు ఇంద్రద్యుమ్నుడు.
ఆ రాత్రి ఒక ఝంఝామారుతం ఓడను విసిరికొట్టింది. ఇద్దరూ ఓడలోంచి సముద్రంలో పడ్డారు. కెరటపు తాకిడికి ఇంద్రద్యుమ్నుని సందిటిలోని చిత్రసేన జారిపోయింది.
కొంతసేపటికి ఆ విషయం గుర్తించినప్పటికీ.. తనలో ఇంకా ప్రాణం ఉంది కనుక, ఇంద్రద్యుమ్నుడు భుజాల సత్తువకొద్దీ ఈదసాగాడు. కానీ ఎంతదూరమని ఈదగలడు?! అద్భుత ఫలాన్ని తిన్నందువల్ల అతడికి ఆకలి దప్పికలు లేవు. కానీ, సముద్రపు కెరటాల ఉధృతికి తనను తాను నిలువరించుకుంటూ.. ఈదుతూనే ఉండటానికి కావలసిన అదనపు సత్తువను ఎక్కడినుంచి తెచ్చుకోగలడు?! అలుపు వస్తున్నది. స్పృహ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
ఇక పోరాడి లాభంలేదని నిశ్చయించుకున్నాడు. ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. చిత్తాన్ని ఈశ్వరునిలో నిలిపి ఈదడం మానేశాడు. తాను సముద్రంలో మునిగిపోతున్నాననే అనుకున్నాడు.
ఆ సమయంలో అతని నాసాపుటాలకు అద్భుతమైన పరిమళం సోకింది. కండ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా నీటివాలుకు అభిముఖంగా కొట్టుకువస్తూ ఒక మహా దారువు కనిపించింది. దగ్గరికి వచ్చేసరికి ఆ దారువే ఒక ఓడంత పెద్దదిగా తోచింది. ఇంద్రద్యుమ్నుడు కొద్దిగా ఈది ఆ దారువును దొరకబుచ్చుకున్నాడు.
విచిత్రంగా ఆ దుంగపై తన భార్య చిత్రసేన కనిపించింది. భర్తను చూసి బావురుమన్నది. అతిప్రయత్నంమీద ఇంద్రద్యుమ్నుడు దుంగపైకి చేరుకున్నాడు.
చిత్రసేనను కౌగిలించుకుని..
“రాణీ! మళ్లీ మనమిద్దరం ఇలా కలుసుకోవడం కేవలం భగవంతుడి అనుగ్రహం తప్ప మరోటి కాదు. ఈ దారువునే భగవంతుడిగా తలచుకుందాం. ఇది మనల్ని తీరానికి చేర్చగలదని నాకు తోస్తున్నది” అన్నాడు ఇంద్రద్యుమ్నుడు.
అద్భుతఫలం తిన్నందువల్ల వారిద్దరికీ ఆకలి దప్పికలు లేవు. మహారాజు ఆ దారువునే భగవంతుడిగా తన బుద్ధిలో నిలుపుకొన్నాడు. దానిని మనస్సనే కుసుమాలతో ఆరాధించసాగాడు.
అలా ఎంతకాలం గడిచిందో తెలియదు. చివరికి ఒకనాటి తెల్లవారుజామున భూమి కనిపించింది. వారి ఆనందానికి హద్దు లేకుండాపోయింది. “దేవా దేవా!” అని పెద్దగా కేకలు వేస్తూ భార్యతోపాటు, ఇంద్రద్యుమ్నుడు నేలకు దిగాడు. అక్కడివరకూ తమను మోసుకొచ్చిన దారువును కూడా తీరానికి తీసుకువచ్చాడు.
అదో చందనపు దుంగ. దానిని భద్రపరిచి, అప్పుడు తామున్నది ఏ దేశమో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. కొంతదూరంలో ఏవో సైనిక శిబిరాలు కనిపించాయి. అక్కడికి వెళ్లి చూసేసరికి, ఆ శిబిరాలే ఓ గ్రామంలా అనిపించాయి.
ఓ భటుని సమీపించి..
“ఏమయ్యా! ఈ సేనావాహిని ఎవరిది? ఇదే దేశం?! అన్నట్లు ఇదే సంవత్సరం, తిథివార నక్షత్రాలేమిటి?!” అని ప్రశ్నించాడు ఇంద్రద్యుమ్నుడు.
అందుకా సైనికుడు పరిహాసం చేస్తూ..
“చూడబోతే చదువుకున్నవాడిలా కనిపిస్తున్నావు?! ఇదే దేశమో కూడా తెలియదా?! సంవత్సరం పేరు కూడా మరిచిపోయావా?! ఇప్పుడు నువ్వున్నది ఓఢ్ర దేశంలో. ఇది చిత్రభాను సంవత్సరం. ఈవేళ ఆషాఢ శుద్ధ పాడ్యమి, శుక్రవారం, పునర్వసు నక్షత్రమని ఇప్పుడే పంచాంగం బ్రాహ్మణుడు చెప్పి వెళ్లాడు” అని చెప్పాడు.
ఆ మాటలువిన్న ఇంద్రద్యుమ్నుడు ముక్కుమీద వేలేసుకుని..
“చిత్రా! ఇది విన్నావా?! మనం సముద్రంలో చిక్కుకుపోయి, మూడేళ్లపాటు ఆ దారువుపైనే బతికాం. ఆనాడు విశాలాక్షి ఆ అద్భుతఫలాన్ని మనకు పంచివ్వకపోతే ఈపాటికి చనిపోయి చాలాకాలమై ఉండేది” అన్నాడు.
“ఏమిటో.. మీ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి” అన్నాడు భటుడు.
“అది సరే.. ఇంతకూ ఈ శిబిరాలెవరివో చెప్పావు కాదేం?!” తిరిగి ప్రశ్నించాడు ఇంద్రద్యుమ్నుడు.
“అయ్యా! ఇవి ఇంద్రద్యుమ్న మహారాజు కుమారుడైన విజయులవారి సేనలు. దైవజ్ఞుల మాటలను అనుసరించి, మా మహారాజుగారు తమ తండ్రిగారిని కలుసుకోవడానికి ఇక్కడికొచ్చి మూడురోజులైంది” అని సమాధానమిచ్చాడు భటుడు.
ఆ మాటలు విని మహదానందంతో..
“మేము మీ మహారాజును కలుసుకోవాలి. వెళ్లి వారికి మా గురించి చెప్పగలవా?” అన్నాడు ఇంద్రద్యుమ్నుడు.
“ఎవరు వచ్చారని చెప్పాలి?” అని భటుడు తిరుగు ప్రశ్నవేశాడు.
“మీ తండ్రి ఇంద్రద్యుమ్న మహారాజు, మీ తల్లిగారు వచ్చారని చెప్పు” అని సమాధానం వచ్చింది. ఆ సమాధానం విన్నవెంటనే గుడ్లు తేలవేసి, ఒక్క ఉదుటున భటుడు తమ రాజు వద్దకు పరుగుపెట్టాడు.
కొద్దిసేపటిలో విజయుడు భార్యాసమేతంగా వచ్చాడు. వారితోపాటు మదనుడు, విశాలాక్షి, వసంతలతిక కూడా ఉన్నారు. తగినంత విశ్రాంతి తరువాత..
“నాన్నా! మీ గురించి ఎక్కడెక్కడో వెతికాను. కాశీరాజ్యాన్ని మన విశాలాక్షి, మదనుడు గెలుచుకున్నారని తెలిసి, వారిని పలకరించడానికి వెళ్లాడు. అక్కడో మహనీయుడైన సన్యాసి కనిపించాడు. ‘మీ నాన్న ధర్మాత్ముడు. చిరకాలజీవి. నీ తల్లిదండ్రులిద్దరూ బతికే ఉన్నారు. నీటిలో చిక్కులు పడుతున్నారు. వచ్చే ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి నిన్ను ఓఢ్రతీరంలో కలుసుకోగలరు’ అని చెప్పాడు. ఆయన మాటలు నమ్మి, మీకోసం మేమంతా ఇక్కడ విడిది చేశాం. అదృష్టంకొద్దీ మళ్లీ మనం కలుసుకోగలిగాం. భగవంతుడు మనయందున ఉన్నాడు” అన్నాడు విజయుడు.
“నిజమే నాయనా! భగవంతుడు మనయందునే ఉన్నాడు. ఆయన వల్లనే మళ్లీ మనకు మంచిరోజులు వచ్చాయి. ఇదుగో.. ఈ చందనదారువు చూశావా! దీనిపైనే మూడేళ్లపాటు మీ అమ్మ, నేను సముద్రజలాల్లో కాలక్షేపం చేశాం. ఈ దారువుపై నాకు దైవమనే బుద్ధి కలిగింది. దీనిని భగవత్ శిల్పాలుగా మలిచి, ఇక్కడో ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాను. వెంటనే ఏర్పాట్లు చేయి” అని ఆజ్ఞాపించాడు ఇంద్రద్యుమ్నుడు.
* * *
ఇంద్రద్యుమ్న మహారాజు ఆదేశాల మేరకు సమర్థులైన శిల్పులెందరినో రప్పించారు. వెనువెంటనే ఆలయ నిర్మాణం కూడా ఆరంభమైంది. ప్రధానాలయం చుట్టూ అనేక ఆలయాలు నిర్మాణం జరుగుతున్నది. కానీ, ఆ చందనదారువును ఏ దేవతామూర్తిగా మలచాలో మాత్రం నిర్ణయం కాలేదు. సమర్థుడైన శిల్పికోసం అన్వేషణ జరుగుతూనే ఉన్నది. అలాంటి సమయంలో ఒకనాడు ఆకస్మికంగా ఒక శిల్పి వచ్చాడు. ఆయన ఆకార విశేషాలు చూడగానే, మారుమాట్లాడకుండా ప్రధానమూర్తిని చెక్కే పనిని ఆయనకే అప్పగించాడు ఇంద్రద్యుమ్నుడు.
కానీ, ఆ శిల్పి కొన్ని షరతులు పెట్టాడు.
“శిల్పం చెక్కడానికి నాకు సాధన సంపత్తి ఏమీ అవసరం లేదు. ఈ దారువును ఒక రహస్య ప్రదేశంలో తెరలు కట్టి ఉంచాలి. నేను ఒంటరిగా శిల్పం చెక్కే పని నిర్వహిస్తాను. పని పూర్తయ్యేవరకూ మళ్లీ మీకెవ్వరికీ కనిపించను. పని పూర్తయిందని నా అంతట నేనే బయటికి వచ్చి చెప్పేవరకూ ఎవరూ లోపలికి రాకూడదు” అన్నాడు.
ఇంద్రద్యుమ్నుడు ఒప్పుకొన్నాడు. శిల్పనిర్మాణం ప్రారంభమైంది. మూడు సంవత్సరాల కాలం గడిచింది. ఆనాడు తెరలలోకి ప్రవేశించిన శిల్పి అన్నేళ్లనుంచీ అన్నపానీయాలకు బయటికి రానేలేదు.
‘పాపం ఆయన బతికున్నాడో లేదో కూడా తెలియడం లేదు. ఇన్ని రోజులు ఊరుకోవడం కూడా తప్పే!’ అనుకుంటూ ఇంద్రద్యుమ్నుడు తెర తొలగించుకుని చూశాడు.
అక్కడ శిల్పి లేడు. మూడు విగ్రహాలు కరచరణాలు పూర్తికాని స్థితిలో దర్శనమిచ్చాయి. ఇప్పుడు ఈ విగ్రహాలను ఎవరు పూర్తి చేయగలరని పశ్చాత్తాపంతో కూడిన దుఃఖంలో మునిగిపోయాడు మహారాజు.
అప్పుడు ఆకాశవాణి..
“అనఘా! చింతించకు. స్వామి ఈ రూపంతోనే ‘జగన్నాథస్వామి’ పేరుతో వెలసి ఉంటారు. నీ కీర్తి భూమిపై చిరస్థాయిగా నిలిచిపోతుంది”.. అని పలికింది.
భగవంతుడికి తనపై కలిగిన ప్రేమాతిశయానికి ఇంద్రద్యుమ్నుడు ఆనంద పరవశుడయ్యాడు. శుభలగ్నంలో ఆలయానికి కుంభాభిషేకం జరిపించాలని అనుకున్నాడు. ఆ లగ్నాన్ని తెలుసుకోవడానికి, యోగబలంతో బ్రహ్మ లోకానికి వెళ్లాడు. అక్కడ చతుర్ముఖుడైన బ్రహ్మను చూసి, చేతులు జోడించి మొక్కాడు.
“శుభలగ్నం నాచేత పెట్టించుకోవాలని ఇంతదూరం వచ్చావా?! చాల్చాలు. అన్నీ అయిపోయాయి. పోపో!” అని బ్రహ్మ కసురుకున్నాడు.
‘ఇదెక్కడి మాయ?’ అనుకుంటూ ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మలోకం నుంచి తిరిగి నేలకు వచ్చాడు. అప్పటికే జగన్నాథపురిలో వేరొక ఆలయంలో స్వామి ప్రతిష్ఠితమై ఉన్నాడు. ఆలయంలోకి వెళ్లబోతే అక్కడ ఉన్న కావలివాళ్లు అడ్డుపెట్టారు.
“సమయం దాటిపోయింది మళ్లీరా!” అంటూ అతడిని తోసివేశారు. తన కుమారుడు, భార్య గురించిన వివరాలేవీ తెలియరాలేదు. తనను ఎరిగినవారు కూడా ఎవరూ కనిపించలేదు.
అప్పుడు సముద్రతీరానికి పోయి, భక్తివిశ్వాసాలతో ప్రార్థించగా..
“రాజా! చింతించకు. కారణాంతరం చేత నువ్వు రాకముందే నేను ప్రతిష్ఠింపబడ్డాను. నీ ఆలయానికి కూడా ఏటా వస్తూ ఉంటాను. నీ కీర్తి చిరకాలం నిలుస్తుంది. నువ్వు ఇక్కడినుంచి వెళ్లి చాలాకాలం కావడం చేత, నీ వాళ్లందరూ పరలోక గతులయ్యారు. అదిగో.. నీ కోసం దేవలోకం నుంచి విమానం వస్తున్నది. దానిని అధిరోహించి, నీ భార్యాపుత్రులను కలుసుకో!” అని గగనతలం నుంచి వినిపించింది.
(ఇది ఒడిశాలోని పూరీలో జగన్నాథస్వామికి సంబంధించిన కథ. ఇంద్రద్యుమ్నుడనే మహారాజు ఆ క్షేత్రంలో జగన్నాథస్వామిని దారుబ్రహ్మగా ప్రతిష్ఠించడం వెనుక అనేక జానపద, పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నాయి. అన్నిటిలోనూ జగన్నాథ విగ్రహాలు చెక్కడానికి తగిన దారువు సముద్రంలో కొట్టుకురావడం అనే కథ ఉంటుంది. అయితే మధిర సుబ్బన్నదీక్షితులు దానిని చందనదారువుగా పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడున్నవి మాత్రం వేపకొయ్యలతో చెక్కినవి. అధిక జ్యేష్ఠమాసం వచ్చినప్పుడు స్వామి విగ్రహాలను కొత్తగా చెక్కుతుంటారు. పూరీ జగన్నాథ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి పొందింది)
(వచ్చేవారం.. రహస్య స్నేహితుడు)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu Episode 23 ( కాశీ మజిలీ కథలు ) | విశాలాక్షి కల”
Kasi Majili Kathalu Episode 22 | మలయాళ దేశం
Kasi Majili Kathalu Episode 20 ( కాశీ మజిలీ కథలు ) | చేప ఊరికే నవ్వదు – 2
Kasi Majili Kathalu Episode 19 ( కాశీ మజిలీ కథలు ) | చేప ఊరికే నవ్వదు
Kasi Majili Kathalu Episode 17 ( కాశీ మజిలీ కథలు ) | చిత్రసేన
Kasi Majili Kathalu Episode 16 ( కాశీ మజిలీ కథలు ) | శరభసాళువం
Kasi Majili Kathalu Episode 15 ( కాశీ మజిలీ కథలు ) | దైవమిచ్చిన భార్య