మోటకొండూర్, సెప్టెంబర్ 12 : పేద, మధ్య తరగతి ప్రజలకు సొంత ఇల్లు ఓ కల. ఇల్లు కట్టుకునేందుకు, కొనేందుకు తమ జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బును వెచ్చిస్తుంటారు. ఈ నేపథ్యంలో అర్హులు పలువురు ప్రభుత్వ చేయూతను అందిపుచ్చుకుంటుంటారు. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పీట్ల రాజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారుడిగా ఎంపికయ్యాడు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతో ఎంతో సంతోషంతో తమ కలను సాకారం చేసుకునే కృత నిశ్చయంతో పిల్లల భవిష్యత్‌ను పక్కన పెట్టిమరి కట్టుకున్న భార్య సుశీల మెడలోని తాళిని కుదువబెట్టి, ఇతరుల వద్ద అప్పులు చేసి ఇంటి నిర్మాణం చేపట్టాడు. ప్రభుత్వం నుండి మొదటి విడుతగా రాజు ఖాతాలో రూ.లక్ష జమయ్యాయి. రెండో విడుత నగదు జమ కావాల్సి ఉండగా అధికారులు వచ్చి చావు కబురు చల్లగా చెప్పారు.
ఆరు సంవత్సరాల క్రితం ఓ వాహనం రాజు పేరుపై నమోదైన కారణంతో పేమెంట్ బ్లాక్ అయిందని, ఇక బిల్లు రాదని తేల్చి చెప్పారు. దీంతో కుటుంబంతో కలిసి కలల ఇంటిలోకి ఆనందంగా అడుగు పెడదామనుకున్న రాజు అధికారుల సమాధానంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎంతో కష్టపడి ఇంటి నిర్మాణం చేపట్టినట్లు, అప్పులు తెచ్చి ఇంటి నిర్మాణం చేపట్టినట్లు, ఇప్పుడు తమకు చావే శరణ్యం అని కన్నీటిపర్యంతమయ్యాడు. తట్టుకోలేని రాజు తీవ్ర ఆవేదనతో తనను తానే కొట్టుకోవడంతో తలకు తీవ్ర గాయమైంది. గ్రామంలో ఈ ఘటన కలకలం రేపగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయమై అధికారులను వివరణ కోరగా.. మొదటి పేమెంట్ వచ్చిన సమయంలో ప్రభుత్వ అధికారులు 360 డిగ్రీలు అతని పేరుపై ఎలాంటి ఆస్తి గాని, వస్తువు గాని లేదని చూపించడంతో మొదటి పేమెంట్ వచ్చిందన్నారు. అయితే రెండో పేమెంట్ రావాల్సి ఉండడంతో రాజుపై ఆరు సంవత్సరాల క్రితం ఒక వాహనం నమోదయిందనే కారణంతోనే పేమెంట్ బ్లాక్ అయి నిధులు రావడం లేదని తెలిపారు.