DMK : తమిళనాడు (Tamil Nadu) లో ఓటర్ల జాబితా (Voters list) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) జరగనివ్వమని డీఎంకే (DMK) సీనియర్ నేత, ఆ రాష్ట్ర మంత్రి దురై మురుగన్ (Durai Murugan) అన్నారు. ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు ఒప్పుకోవడానికి ఇది బీహార్ కాదు. తమిళనాడు. ఇక్కడ ఆ ట్రిక్కులు పనిచేయవు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
తమిళనాడు రాష్ట్రం బీహార్ లాంటిది కాదని, ఇక్కడి ప్రజలు రాజకీయంగా బాగా చైతన్యం కలిగి ఉన్నారని దురై మురుగన్ అన్నారు. తమిళులను తప్పుదోవ పట్టించడం ఎవరివల్లా కాదని చెప్పారు. వెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీహార్‌తో పోల్చితే తమిళనాడులో పరిపాలన, నాయకత్వం మెరుగ్గా ఉన్నాయని అన్నారు. మాకు దళపతి నాయకత్వం ఉన్నదని, ఇక్కడ ఆ ట్రిక్కులు పనిచేయవని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సవరించింది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈసీ హడావిడిగా ఓటర్ల జాబితాను సవరించడం వివాదాస్పదమైంది. ఎన్నికల సంఘం కేంద్రంలోని అధికార బీజేపీకి అనుకూలంగా ఓట్ల చోరీకి పాల్పడుతున్నదని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టే అంశంపై ఎన్నికల సంఘం సమాలోచనలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రయత్నాలను మీడియా దురై మురుగన్ ముందు ప్రస్తావించింది. దాంతో ఆయన పైవిధంగా స్పందించారు.