సూర్యాపేట, సెప్టెంబర్ 12 : బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల సమాధానాలు చాలా బలహీనంగా ఉన్నాయని, వారివి దింపుడు కల్లెం ఆశలు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. స్పీకర్‌కు ఫిరాయింపు ఎమ్మెల్యే సమాధానాలపై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు సమాధానంలో పార్టీ మారలేదని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. రేవంత్‌ను కలిసింది కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. రేవంత్ కప్పింది పార్టీ జెండా కాదు.. జాతీయ జెండా అని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. ఇది జాతీయ జెండాను అవహేళన చేయడమేన్నారు. దొంగతనం చేసి తప్పించుకోలేని స్థితిలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. ఇప్పటికే పార్టీ విశ్వాసం కోల్పోయారు.
నమ్మిన పార్టీకి, ప్రజలకు ద్రోహం చేసిన ఎమ్మెల్యేలను ప్రజలు క్షమించరు. కోట్లాది మంది ప్రజలకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్‌పై నమ్మకమున్నప్పుడు నోటీసులు వచ్చినప్పుడు కేసీఆర్ దగ్గరకే రావాలి కదా అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇంటికి ఎందుకు వెళ్లారో సరైన సమాధానం చెబుతారా? ఇచ్చిన గడువు లోపు స్పీకర్‌కు సమాధానం ఇస్తాం. ప్రజల ముందు అడ్డంగా దొరికిన దొంగలు వీళ్లు. ఎవరో కాపాడుతారానుకుంటే అది వాళ్ల తెలివి తక్కువ తనమేనన్నారు. రేవంతే కాదు వాళ్లను ఎవరూ కాపాడలేరన్నారు. వాళ్లను అనర్హులుగా ప్రకటించడం, ఉప ఎన్నికలు రావడం, ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు. వారిని రాజకీయంగా శాశ్వతంగా బొందపెడతరని పేర్కొన్నారు.