ఆత్మకూరు(ఎం), సెప్టెంబర్ 12 : ఆత్మకూరు(ఎం) మండలంలోని కూరెళ్ల ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న పల్లె దవాఖాన డాక్టర్ అశోక్‌ను జిల్లా కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం సస్పెండ్ చేశారు. కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీలో భాగంగా కూరెళ్ల పల్లె దవాఖానను తనిఖీ చేయగా డాక్టర్ అశోక్ విధుల్లో లేకపోవడంతో పాటు, ప్రతి రోజు సరిగ్గా విధులకు హాజరు కాకపోవడంతో వెంటనే సస్పెండ్ చేయాలని డీఎంహెచ్ఓని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం తుక్కపురంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన పరిశీలించి లబ్ధిదారులు ప్రభుత్వం విధించిన గడువులోపు నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. గురువారం కురిసిన భారీ వర్షంతో మండల కేంద్రంలోని బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కలెక్టర్ పరిశీలించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ రాములు నాయక్, ఎంపీఓ పద్మావతి, పంచాయతీ కార్యదర్శులు శేఖర్, రాఘవేందర్ పాల్గొన్నారు.