(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. నిన్న యూఏఈ, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, జోర్డాన్ వంటి గల్ఫ్ దేశాలకు యుద్ధం విస్తరించగా.. తాజాగా ఇప్పుడు ఆసియా-ఐరోపా సరిహద్దు దేశం అజర్‌బైజాన్‌కూ పాకాయి. అజర్‌బైజాన్‌లోని నఖీచేవాన్ ఎయిర్‌పోర్టుతో పాటు మరో స్కూల్ ప్రాంగణంలో ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో పెద్దయెత్తున మంటలు చెలరేగాయి. ఈ దాడులను అజర్బైజాన్ తీవ్రంగా ఖండించింది. తమ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకొనే క్రమంలో ఇరాన్‌కు త్వరలోనే గట్టిగా బదులిస్తామని అజర్బైజాన్ రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు తమ యుద్ధ నౌక ఐరిస్ దేనాపై అమెరికా దాడులను తీవ్రంగా పరిగణించిన ఇరాన్.. అగ్రరాజ్యానికి చెందిన ట్యాంకర్‌ను పేల్చేసింది. ఇదిలాఉండగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్ సంతాపం వ్యక్తం చేసింది.
ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనాపై అమెరికా దాడిని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్రంగా ఖండించారు. దీనికి తగిన ప్రతీకారం తీర్చుకొంటామని హెచ్చరించారు. ఆయన ప్రకటన వెలువడిన కొద్దిసేపట్లోనే పర్షియన్ గల్ఫ్‌లోని అమెరికాకు చెందిన ఓ ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో నౌక నుంచి పెద్దయెత్తున మంటలు చెలరేగాయి. ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. మరోవైపు, కువైట్ సమీపంలోని జలాల్లో ప్రయాణిస్తున్న ఓ చమురు ట్యాంకర్‌పై ఇరాన్ దాడులు జరిపింది. భారీ పేలుడు శబ్దంతో ట్యాంకర్‌లోని ఇంధనం సముద్రంలోకి ఒలికిపోయింది.
ఇంకోవైపు, దోహాలోని పలు ప్రాంతాలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసినట్టు సమాచారం. లెబనాన్‌లోని 80 హెజ్బొల్లా స్థావరాలను ఇరాన్ ధ్వంసం చేసింది. ఐరిస్ దేనాపై దాడులు జరిగి 24 గంటలు గడువకముందే ఇరాన్‌కు చెందిన మరో నౌక శ్రీలంక దిశగా కదులుతున్నట్టు శ్రీలంక మంత్రి నలిందా జయతిస్సా తెలిపారు. తమ దేశ ప్రాదేశిక జలాల దగ్గరలో ఆ నౌక ఉన్నదన్న ఆయన.. నౌకలోని వారి ప్రాణాలను రక్షించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తామన్నారు. ఈ నౌకపైన కూడా అమెరికా దాడులు చేయవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో భాగంగా గడిచిన 100 గంటల్లో ఇరాన్‌పై 2 వేల దాడులు జరిపి 20 నౌకలను ముంచేశామని అమెరికా ప్రకటించింది. ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్లో 1,260 మంది పౌరులు మరణించినట్టు ఇరాన్‌కు చెందిన ఓ ఏజెన్సీ వెల్లడించింది. ఘర్షణలు ప్రారంభమైన నాటి నుంచి బుధవారం వరకూ తమ వైమానిక దళం ఇరాన్‌పై 5 వేలకు పైగా బాంబులతో దాడులు చేసిందని ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. ఈ దాడుల్లో వేలాదిమంది ఇరాన్ సైనికులు మరణించినట్టు తెలిపింది. తమ ఆపరేషన్ మరో రెండు వారాల పాటు కొనసాగవచ్చని అభిప్రాయపడింది. ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టులోని ఐఆర్జీసీ స్థావరంపై తాజాగా దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. అమెరికా మద్దతుతో ఇరాన్‌పై యుద్ధానికి తాము సిద్ధమైనట్టు ఉత్తర ఇరాక్‌లోని ఖుర్దు గ్రూప్ ప్రకటించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. అణ్వాయుధ కార్యక్రమాన్ని ఆపివేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఇరాన్ విదేశాంగశాఖ డిప్యూటీ మంత్రి మాజిద్ తఖ్త్ ప్రకటించినట్టు వీడియోలు వైరల్‌గా మారాయి. తాము అణు ప్రోగ్రామ్‌ను నిలిపేయాలంటే.. తమకు సంతృప్తికర ప్రత్యామ్నాయాన్ని అమెరికా ప్రతిపాదించాల్సి ఉంటుందని ఆయన ఓ షరతు పెట్టినట్టు ఆ వీడియోలో ఉన్నది. దీనిపై ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ స్పందించింది. మాజిద్ మాట్లాడిన వీడియో ఇప్పటిది కాదని, అమెరికాతో గతంలో జరిగిన చర్చలకు సంబంధించినదని స్పష్టం చేసింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమైన వేళ అత్యంత శక్తివంతమైన ఖండాంతర అణు క్షిపణి ‘మినిట్‌మ్యాన్-3’ని అమెరికా ఎయిర్‌ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ విజయవంతంగా పరీక్షించింది. అత్యంత కచ్చితత్వంతో ఈ క్షిపణి లక్ష్యాన్ని ఛేదించినట్టు వెల్లడించింది. ఇరాన్‌పై ట్రంప్ సర్కార్ చేపట్టిన సైనిక చర్యకు అమెరికా సెనెట్‌లో మద్దతు లభించింది. ట్రంప్ సైనిక చర్యకు మద్దతుగా 53 మంది ఓటేయగా.. 47 మంది వ్యతిరేకించారు. ఇరాన్లో పాలకులు మారేవరకూ అమెరికా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తుందని ఇజ్రాయెల్ అధికారి ఒకరు పేర్కొన్నారు. దీనిపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. తమ దేశంలో పాలన మార్పునకు ప్రయత్నిస్తే ఇజ్రాయెల్‌లోని డిమోనా అణుప్లాంట్‌ను పేల్చేస్తామని హెచ్చరించింది.

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్ సంతాపం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్లిన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. సంతాప సందేశాన్ని అందజేశారు. మరోవైపు, పశ్చిమాసియా, ఉక్రెయిన్ యుద్ధాలకు త్వరగా ముగింపునివ్వాలన్న ప్రధాని మోదీ.. సమస్యలను దౌత్య మార్గంలో పరిష్కరించుకోవాలని, సైనిక ఘర్షణలు దేనికీ పరిష్కారాన్ని చూపలేవని అన్నారు. ఇరాన్‌పై దాడులకు భారత్‌లోని పోర్టులను అమెరికా దళాలు వాడుతున్నాయంటూ అమెరికా ఆర్మీ మాజీ కర్నల్ డగ్లస్ మెక్‌గ్రెగోర్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన భారత్.. ఇవన్నీ తప్పుడు, నకిలీ ఆరోపణలేనని కొట్టిపారేసింది.
హొర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ఇరాన్ మంగళవారం ప్రకటించింది. భారత్‌కు సరఫరా అయ్యే 40-50 శాతం చమురు ఈ జలసంధి గుండానే వస్తుండటంతో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో గురువారం ఇరాన్ కీలక ప్రకటన చేసింది. హొర్ముజ్ జలసంధి గుండా అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా దేశాలకు చెందిన నౌకలకు మాత్రమే అనుమతి ఉండబోదని వెల్లడించింది. ఈ క్రమంలో భారత్‌కు కొంత ఊరట లభించినట్టేనని విశ్లేషకులు చెప్తున్నారు. దేశంలో ప్రస్తుతం 50 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని, కాబట్టి పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన అవసరం లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. చమురు సంక్షోభం ముంచుకొస్తే రష్యా తదితర దేశాల నుంచి దిగుమతులపై యోచిస్తామని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. హొర్ముజ్ జలసంధి మూసివేయడంతో భారత జెండాలున్న 37 నౌకలు నిలిచిపోయాయి.