బీబీనగర్, మార్చి 30 : తెలంగాణ రాష్ర్ట మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అసెంబ్లీ సమావేశంలో గొల్ల-కురుమల బతుకుల గురించి ప్రస్తావించి వారి అభివృద్ధి అంశాలపై గళమెత్తినందుకు గొల్ల-కురుమల సంఘం నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోమవారం అయనను కలిసి ఘనంగా సన్మానించి కృతజతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అసెంబ్లీలో గొర్రె పిల్లలకు నాలుగు నెలలకు ఒకసారి వేయాల్సిన నట్టల నివారణ మందులు కూడా అందించలేని పరిస్థితి నెలకొన్నదని ఆయన అసెంబ్లీ సాక్షిగా విమర్శించినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 28 నెలలు కావస్తున్నా గొల్ల-కురుమల సమస్యలపై తగిన శ్రద్ధ చూపలేదన్నారు. గాంధీభవన్లో గొర్రెలతో నిరసన తెలిపిన తర్వాత ఒక్కసారి మాత్రమే నట్టల నివారణ మందు అందజేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆరోపించారు.
రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో వంద రోజుల్లో రూ.2 లక్షలు నగదు బదిలీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పోచబోయిన శ్రీహరి యాదవ్, రాష్ర్ట ఉపాధ్యక్షుడు గుండెబోయిన అయోధ్య యాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లా గొర్ల కాపర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ యాదవ్, ప్రధాన కార్యదర్శి సోమ్ రమేష్ కురుమ, ఉపాధ్యక్షుడు జల్లి నరసింహ కురుమ పాల్గొన్నారు.