సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ ) : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా సోమవారం రాజధాని వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. పలు చోట్ల గాంధీ విగ్రహానికి వినతి పత్రాలు సమర్పించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కాంగ్రెస్ సర్కార్ రద్దు చేయడానికి చేస్తున్న కుట్రలను నిరసిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ప్రధాన రహదారులు, కూడళ్ల్ల వద్ద నిరసనలతో హోరెత్తించారు. కుత్బుల్లాపూర్ జోనల్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించిన భారీ ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్, డివిజన్ల వారీగా మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు నిరసన తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలు, మహిళలు, రైతులు, వృద్ధుల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలను కూడా నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు. పాలనలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, కంటి వెలుగు వంటి పథకాలను రద్దు చేసిందని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు అన్ని వర్గాల వారి కి అండగా ఉండేందుకే కేసీఆర్ ఆనాడు కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రారంభించారని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత ్వం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డల వివాహాలకు దాదాపు రూ.13 వేల కోట్ల ఆర్థిక సాయం అందించిందని గుర్తు చేశారు.

పేదింటి ఆడబిడ్డల ఆర్థిక భరోసాకు, ఆత్మగౌరవానికి అండగా నిలిచేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ మం డిపడ్డారు. ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామని కాం గ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ మాజీ కార్పొరేషన్ ముద్దం నరసింహాయాదవ్ విమర్శించారు. పదేండ్లుగా విజయవంతం గా అమలవుతున్న ఆయా పథకాలపై ప్రస్తుత ప్రభుత్వం కోర్టులో కేసు వేయించి రద్దు చేయాలన్న కుట్రలు చేస్తున్నదన్నారు. కోర్టు కేసుల పేరుతో కాలయాపన చేయకుండా రెండు పథకాలను కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టమైన అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయడం లేదని ప్రశ్నించారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాం లో ఆసరా పెన్షన్లను రూ.2 వేలకు పెంచామని, బీడీ కార్మికుల కూ పెన్షన్ ఇచ్చామని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీశ్‌రావు వివరించారు. కొత్తగా అర్హత పొందిన వృద్ధులు, బీడీ కార్మికులకు పెన్షన్లు మంజూరు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతామన్న కాంగ్రెస్ హామీ ఇప్పటికీ అమలు కాలేదని ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్థన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, కంటి వెలుగు కార్యక్రమాలను ప్రారంభిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఆపి వేసిందన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీనిచ్చినా, ఇంకా చాలా మంది రైతులకు ప్రయోజనం అందలేదన్నారు.